kumaram bheem asifabad- అన్నదాత విలవిల
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:50 PM
ఆరుగాలం శ్రమించే రైతున్నకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి వైఫరీత్యాలకు రైతన్నలు విలవిలలాడుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏదో ఒక రూపంతో జిల్లా రైతాంగం అతలాకుతలమవుతుంది. ఏటేటా పంట సాగు ఖర్చులు పెరుగుతున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది
- చేతికొచ్చే పంట నీటిపాలైందని ఆవేదన
- దిగుబడి పడిపోయిందని దిగులు
- జిల్లాలో వారం వ్యవధిలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
ఆసిఫాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించే రైతున్నకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి వైఫరీత్యాలకు రైతన్నలు విలవిలలాడుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏదో ఒక రూపంతో జిల్లా రైతాంగం అతలాకుతలమవుతుంది. ఏటేటా పంట సాగు ఖర్చులు పెరుగుతున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభంలో విత్తనాలు విత్తిన రైతన్నలు పంటల దిగుబడి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారైన పంటలు ఆశించిన స్థాయిలో పండుతాయని భావించిన రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఎకదాటిగా వర్షాలు కురియడటంతో వేసిన పంటలు ఎదుగుదల లేక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, మొంథా తుఫాన్ కారణంగా సుమారు పదివేల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వానకాలం సీజన్‌లో సుమారు 4.45 లక్షల ఎకరాల్లో రైతులు జిల్లాలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో పత్తిపంటదే సింహభాగం. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట చేనులలో వర్షం, వరద నీరు నిల్వ ఉండి పత్తి మొక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయి.పంటలు దెబ్బతిన్నాయని దిగుబడి రాదని దిగాలు తో జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
- పదివేల ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి..
జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పదివేల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు అధి కారులు అంచనాలు వేశారు. కొన్ని మండలాలలో ఎకదాటిగా కురిసిన వర్షాలకు పంటలు నీట మునగగా నది పరివాహక ప్రాంతాలలోని పంటచేలలో ఇసుక మేటలు వేశాయి. వర్షాలతో పంటచేలలో నీరు నిలువ ఉండటంతో పంటలన్ని జవుకుపట్టి పంట ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు కళకళళాడుతాన్నాయని సంతోషంలో ఉన్న రైతులకు భారీ వర్షాలు, వరదలు, మొంథా తుఫాన్ ముంచెత్తడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన మహరాష్ట్రలో కురిసిన వర్షాలకు పెనుగంగా, ప్రాణహిత, పెద్దవాగులు ఉగ్రరూపం దాల్చి అతలాకుతలం చేశాయి. జిల్లాలోని పెనుగంగా, ప్రాణహిత, పెద్దవాగు సరిహద్దు పరివాహక మండలాలైన కౌటాల. చింతలమానేపలి, బెజ్జూర్. పెంచికల్‌పేట్, దహెగాంలలో వేల ఎకారాలలో పంట నష్టం వాటిల్లింది. వరదల కారణంగా పంట పొలాలు వరద నీటిలో మునిగి పోయాయి. కొన్ని చోట్ల ఇసుక మేటలు వేయగా మరికొన్ని చోట్ల పంటలు కొట్టుకుపోయి ఎడారిలా మారాయి. సిర్సూర్ నియోజక వర్గంలో ఏటా వర్షాకాలంలో ప్రాణహిత. పెనుగంగా, పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో వరదలు పంటలను ముంచెత్తుతునే ఉన్నాయి. మహారాష్ట్రలో వర్షాలు కురిసినా, అక్కడి ప్రాజెక్టుల నీటిని వదిలినా ప్రాణహిత పరివాహక మండలాల్లో తీవ్ర పంట నష్టం జరుగుతోంది. దీంతో రైతులు ఏటా నష్టాల పాలవుతున్నారు. నాలుగైదేళ్లుగా పంటలు నష్టపోయిన వారికి పరిహారం రాలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో సాగు ఇలా...
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నా యి. ఇందులో పత్తి 3,35,363 ఎకరాలు, వరి పంట 56,861 ఎకరాలు, కంది పంట 30,430 సాగవుతోంది. మొక్కజొన్న, జొన్న,పెసర , మి నుములు, సోయబీన్, మిరప, వేరుసెనగ, అము దాలు, నువ్వులు 22,395 ఎకరాలలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏటా రైతులు పత్తిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఆధిక వర్షాల కారణంగా పత్తిపంట సాగు చేస్తున్న రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో పత్తి రైతులు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాదని దిగులు చెందుతున్నారు. ఆధిక వర్షాలతో ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేక పోవడం, పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుపాన్‌తో పత్తి నేలరాలిపోవడంతో రైతన్నలలో ఆందోళన వ్యక్తం అవుతుంది.జిల్లాలోని ఈ సీజన్‌లో 3.35లక్షల ఏకరాలలో పత్తి పంట సాగు చేయగా 38 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. ఏకరానికి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావల్సి ఉంది. వర్షాలు, వరదలు, తుఫాన్ ప్రభావంతో పంటలు ధ్వంసమై ఏకరానికి నాలుుగు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏటేటా పత్తి పంట సాగుకు ఖర్చులు పెరుగుతున్నా రైతన్నలకు మాత్రం గిట్టుబాటు ధర పెరగడం లేదు. దీంతో పత్తి సాగు రైతన్నల పాలిట భారం అవుతున్నది. విత్తనాలు, ఎరువులతో పాటు ఇతరాత్ర వ్యవసాయ పనుల కోసం ఏటేటా ఖర్చులు తడిసి మోపడువుతున్నప్పటికీ గిట్టుబాటు ధరలో ఏ మాత్రం తేడా రావడం లేదు. ఏటా అతివృష్టి అనావృష్టితో పత్తి రైతులు కోలోలేక పోతున్నారు. పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని మద్దతు ధర ఇంకా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వారం వ్యవధిలో..
జిల్లాలో అధిక వర్షాలకు పంట దెబ్బతిన్నదన్న మనస్తాపంతో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పంట దిగుబడి రాని పరిస్థితి నెలకొందనే దిగాలుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. లింగాపూర్ మండలంలోని సీతారాంనాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం(59), సిర్పూర్-టి మండలం చింతకుంట గ్రామానికి చెందిన పిట్టల కిష్టయ్య (65), వాంకిడి మండల కేంద్రానికి చెందిన బుట్లే సుధాకర్ (34) మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ప్రతి పక్షపార్టీల నాయకులు చెబుతున్నారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహరం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా తగిన కార్యాచరణ లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.