Anjan Kumar Yadav: నేను పోటీ చేయాలన్నది.. జూబ్లీహిల్స్ ప్రజల కోరిక
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:35 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...
టికెట్ ఇచ్చి.. మంత్రిగా అవకాశం ఇవ్వాలి
చిట్‌చాట్‌లో అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. తనకు జూబ్లీహిల్స్‌లో ఓటు ఉందని, తాను స్థానికుడినని పేర్కొన్నారు. శనివారం అంజన్‌కుమార్ విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. రెండు పర్యాయాలు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో అధిక జనాభాగల సామాజిక వర్గానికి మంత్రి మండలిలో చోటు లభించాల్సి ఉందని, అందుకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని, గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలనీ అన్నారు. తన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు యూత్ కాంగ్రెస్ కోటాలో ఎంపీ పదవి ఇచ్చారని, ఆయన నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేశాడని చెప్పారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న తనకు ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ: దానం
ప్రస్తుతానికి తాను కాంగ్రె్‌సలో ఉన్నానని, అదిష్ఠానం ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపు విషయానికి సంబంధించి స్పీకర్ నుంచి తనకు ఇంకా నోటీసులు రాలేదని చెప్పారు. నోటీసులు వచ్చిన తర్వాత అన్ని అంశాలు పరిశీలించి సమాధానం చెబుతానన్నారు.