Ministers Criticize KCR: అబద్ధాల కేసీఆర్
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:08 AM
కాంగ్రెస్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప.. ప్రజా సంక్షేమం పట్టడంలేదన్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు....
పార్టీ మనుగడ కోసమే బయటికొచ్చారు.. మీది ప్రచారమైతే.. మాది దృఽఢ విశ్వాసం
మీలాగా గాలిలో మేడలు కట్టం: శ్రీధర్‌బాబు
కుటుంబ రాజకీయాల వల్లే బీఆర్‌ఎస్ పతనం: జూపల్లి
ప్రజలు బీఆర్‌ఎస్ తోలు తీశారు: పొన్నం
ముందుగా బిడ్డ సంగతి చూసుకో: వాకిటి
ప్రతిపక్ష నేతగా బాధ్యత మరిచారు: అడ్లూరి
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప.. ప్రజా సంక్షేమం పట్టడంలేదన్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోతోందని, పార్టీ మనుగడ కోసమే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటికి వచ్చి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ది అంతా ఆర్భాటాలతో కూడిన ప్రచార ప్రక్రియ అని, తమది దృఢ విశ్వాసంతో ముందుకెళ్లే స్వభావమని తెలిపారు. ‘మీలాగా గాలిలో మేడలు కట్టడం, అరచేతిలో స్వర్గం చూపించడం మాకు రాదు’ అని శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావద్దని, యువతకు ఉద్యోగాలు రావద్దన్నదే బీఆర్‌ఎస్ పాలసీ అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో ఏ కంపెనీ పెట్టుబడులు పెట్టాలన్నా.. కేసీఆర్ కుటుంబం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ ‘గేట్ పాస్’ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టామని, అందుకే పరిశ్రమలు తెలంగాణకు క్యూ కడుతున్నాయని అన్నారు. ఎక్కడో ఉండి పాలన సాగించిన కేసీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం ‘హైప్’ లాగే కనిపిస్తుందని విమర్శించారు. ఇది హైప్ కాదని, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కల్పిస్తున్న ‘హోప్’ అని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌కు తోలు తప్ప.. కండ లేదు
కేసీఆర్‌ది పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన దద్దమ్మ ప్రభుత్వమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు- రంగారెడ్డిపై కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని పేర్కొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి జూపల్లి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పతనానికి కేసీఆర్ కుటుంబ రాజకీయాలే కారణమని, కేటీఆర్, హరీశ్ వల్లే ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందని అన్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తాగునీటి ప్రాజెక్టు అంటూ సుప్రీంకోర్టుకు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడది సాగునీటి ప్రాజెక్టు అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలతో చర్చలు, కేంద్రంతో ఒప్పందాల విషయంలో వ్యూహం లేకపోవడం వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో అంటకాగారని ఆరోపించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకే ఉందని, అన్ని ఎన్నికల్లోనూ వారు బీఆర్‌ఎస్ పార్టీ తోలు తీశారని అన్నారు. తమ ప్రభుత్వం తోలు తీసే అంశాలేవైనా కేసీఆర్ వద్ద ఉంటే.. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీల అమలు కోసం ఆయనకు లేఖలు రాయాలన్నారు. ప్రధాని చీవాట్లు పెట్టినందుకు సోనియాగాంధీకి లేఖ రాశారా? లేక కేసీఆర్ మెప్పు కోసమా? అని ప్రశ్నించారు. కాగా, కేసీఆర్‌కు ఉన్నట్లుండి పాలమూరుపై ఎందుకు ప్రేమ పుట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ తోలును కేసీఆర్ బిడ్డ కవిత తీస్తున్నారని, ముందు ఆ సంగతి చూసుకోవాలని అన్నారు.
ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కేసీఆర్ ప్రయత్నం: బక్కని నర్సింహులు
వచ్చే శాసనసభ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు ఆశీర్వాదంతోనే కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో నర్సింహులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు అలయ్ బలయ్ చేసుకుని దావత్ ఇచ్చిన కేసీఆర్.. ఆనాడు ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ముందుగా తన కూతురు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అక్రమంగా కొన్న భూముల వివరాలు తమ వద్ద ఉన్నాయని, సరైన సమయంలో బయటపెడతామని చెప్పారు.