Share News

Anand Mahindra: రేవంత్‌ విజన్‌కు ఫిదా

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:40 AM

సాధారణంగా పాలకులు అంకెల గారడీకి, జీడీపీ లెక్కలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయి.....

Anand Mahindra: రేవంత్‌ విజన్‌కు ఫిదా

  • సీఎం ముందుచూపు, రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టత చూశాకే స్కిల్స్‌ వర్సిటీ బాధ్యతలకు ఒప్పుకున్నా

  • ముందు సున్నితంగా తిరస్కరిద్దామనుకున్నా

  • ఆయన మాటలు విన్నాక నో చెప్పలేకపోయా

  • పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న సీఎం తపన నా మనసును మార్చేసింది

  • ప్రజలే కేంద్రంగా తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌

  • మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘సాధారణంగా పాలకులు అంకెల గారడీకి, జీడీపీ లెక్కలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన విజన్‌ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం చుట్టూ ఉంది. సీఎం రేవంత్‌కు ఉన్న స్పష్టత, ముందుచూపు చూసిన తర్వాతే స్కిల్స్‌ యూనివర్సిటీ బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించాను. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ చూశాను. ఇది ప్రజలు కేంద్రంగా, వారి అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, అయా రంగాల నిపుణులను పరిగణనలోకి తీసుకొని తయారైంద’ని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకొనియాడారు. స్కిల్స్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని సీఎం రేవంత్‌ అడిగిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. నిజానికి తనుకున్న పని ఒత్తిడి, ఇతర బాధ్యతల దృష్ట్యా మొదట సున్నితంగా తిరస్కరిద్దామనుకున్నానని చెప్పారు. అప్పటికే తాను మహీంద్రా యూనివర్సిటీ చైర్మన్‌గా ఉన్నందున తన దృష్టి అంతా దానిపై పెట్టానని, స్కిల్స్‌ యూనివర్సిటీ పదవి వద్దని చెప్పానని తెలిపారు. అయితే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ అనేది ఒక్క తెలంగాణకే పరిమితం కాదని, ఇండియా భవిష్యత్తు అని సీఎం తనతో చెప్పారన్నారు. రేవంత్‌ తన విజన్‌ ఏంటో వివరించారని, ఆయనకు రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న స్పష్టత, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న తపన తన మనసును మార్చేశాయని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. సీఎం రేవంత్‌ మాటలు విన్న తర్వాత నో చెప్పలేకపోయానని చెప్పారు. ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్‌ డాక్యుమెంట్‌ కేవలం కార్పొరేట్‌ రాతలను, అంకెలను నమ్ముకుని తయారుచేసింది కాదన్నారు. ఇది ప్రజల కోసం రూపొందించిన బ్లూప్రింట్‌గా కొనియాడారు. స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో ఈ ప్రణాళిక ఉందని ప్రశంసించారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి తమ గ్రూపు తరపున సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌ను ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. ఆయన ‘గౌరవ సభకు నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి ఆకట్టుకున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 03:40 AM