Share News

డ్రైవింగ్‌ సీటులోనే గంటన్నర విలవిల

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:29 AM

ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో డ్రైవింగ్‌ సీటులోనే డ్రైవర్‌ గంటపాటు విలవిలలాడారు.

డ్రైవింగ్‌ సీటులోనే గంటన్నర విలవిల
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బస్సు,

లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నుజ్జునుజ్జయిన బస్సు ముందు భాగం

నార్కట్‌పల్లి మండలంలో ఘటన

నార్కట్‌పల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో డ్రైవింగ్‌ సీటులోనే డ్రైవర్‌ గంటపాటు విలవిలలాడారు. ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుంచి నార్కట్‌పల్లి వైపునకు వస్తున్న సిమెంట్‌ లారీ ఎల్లారెడ్డిగూడెం ఫ్లైఓవర్‌ పైకి చేరుకునేసరికే ఎలాంటి సిగ్నల్స్‌ ఇవ్వకుండానే డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు. అదే సమయంలో వెనుకనుంచి వస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ స్టార్‌లైనర్‌ బస్సు అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతిని నుజ్జునుజ్జుకాగా, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం సీటులోనే ఇరుక్కుపోయి గంటసేపు విలవిలలాడాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే వెళ్లి బస్సులో ఇరుక్కున్న డ్రైవర్‌ను అతికష్టం మీద క్రేన్‌ సాయంతో బయటకు తీసి పోలీస్‌ వాహనంలోనే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 50మంది ప్రయాణిస్తుండగా సుమారు 10మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఘటనపై ఇంకా ఫిర్యాదు రాలేదన్నారు.

గంటన్నర పాటు నిలిచిన ట్రాఫిక్‌

ప్రమాదంతో ఎల్లారెడ్డిగూడెం వద్ద సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్‌ నిలిచిపోగా, వన్‌వేతో వాహనాల రాకపోకలను పునరుద్ధ్దరించారు. డ్రైవింగ్‌ సీటులో ఇరుక్కుపోయిన బస్సు డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసే క్రమంలో గంటన్నర సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ నిలిచిపోవ టంతో అంబులెన్స్‌ కూడా ఘటనా స్థలికి చే రుకోలేకపోవడంతో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంలోనే డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Jul 21 , 2025 | 12:29 AM