Share News

SI Caught Misusing Seized Gold and Pawning: రికవరీ బంగారాన్ని నొక్కేసి.. రివాల్వర్‌ను తాకట్టు పెట్టి!

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:18 AM

అతనో తెలివైన వ్యక్తి.. పక్క రాష్ట్రమైనా ఇక్కడ నాన్‌ లోకల్‌ కోటాలో పోటీ పడి మరీ ఎస్సై ఉద్యోగం సంపాదించాడు. అయితే తన ప్రతిభను...

SI Caught Misusing Seized Gold and Pawning: రికవరీ బంగారాన్ని నొక్కేసి.. రివాల్వర్‌ను తాకట్టు పెట్టి!

  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి అంబర్‌పేట ఎస్సై దొంగాట..

  • ఏపీలో గ్రూప్‌-2 ఉద్యోగం రావడంతో వెలుగులోకి బాగోతం

హైదరాబాద్‌ సిటీ/అంబర్‌పేట, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): అతనో తెలివైన వ్యక్తి.. పక్క రాష్ట్రమైనా ఇక్కడ నాన్‌ లోకల్‌ కోటాలో పోటీ పడి మరీ ఎస్సై ఉద్యోగం సంపాదించాడు. అయితే తన ప్రతిభను డిపార్ట్‌మెంట్‌ ఉన్నతికి వినియోగించాల్సింది పోయి నేరాల బాట పట్టాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పుల పాలై అక్రమాలకు పాల్పడ్డాడు. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసి కుదువబెట్టాడు. అలాగే తన సర్వీస్‌ రివాల్వర్‌ను సైతం డబ్బుల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టాడు. అయితే ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో ఏఎ్‌సవో ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ రిలీవ్‌ అయి సొంత రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగంలో చేరాలని రిలీవ్‌ కోసం ప్రయత్నించగా.. సదరు ఎస్సై బాగోతం వెలుగులోకి వచ్చింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎస్సైని సస్పెండ్‌ చేశారు. అయుతే స్టేషన్‌లో ఇంత జరుగుతున్నా ఎస్‌హెచ్‌వో, డీఐ (డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌)ల నియంత్రణ లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలోని రాయచోటికి చెందిన భానుప్రకాశ్‌రెడ్డి తెలంగాణలో 2020 బ్యాచ్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. గతేడాది అంబర్‌పేట పీఎ్‌సకు డీఎస్సై (డిటెక్టివ్‌ ఎస్సై)గా వచ్చాడు. అయితే గత కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలయ్యాడు. దీంతో ఓ దొంగతనం కేసులో రికవరీ అయిన 5 తులాల బంగారాన్ని తీసుకెళ్లి కుదవబెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. అయితే ఏపీలో ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో ఉద్యోగం సాధించాడు. దాంతో ఇక్కడ రిలీవ్‌ కావాలని ఎస్‌హెచ్‌వో వద్దకు వెళ్లి తన వస్తువులన్నీ అప్పగించాడు. రివాల్వర్‌ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్‌ అడగగా.. తన డెస్క్‌లో దాచిపెట్టిన రివాల్వర్‌ కనిపించడం లేదని తూటాలు మాత్రమే ఉన్నాయని.. సీసీ టీవీ కెమెరాలు చెక్‌ చేయాలని కోరాడు. దీంతో అధికారులు పరిశీలించగా.. ఇటీవల ఓ కేసులో రికవరీ చేసిన 5 తులాల బంగారాన్ని అతడే తీసుకెళ్లినట్లు గుర్తించారు. దానిపై ఎస్సైని ప్రశ్నించగా.. సొంత అవసరాలకు కుదవబెట్టుకున్నానని చెప్పాడు. దీంతో స్టేషన్‌ అధికారులు ఉన్నతాఽధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా డబ్బులు అవసరమై రివాల్వర్‌ను కూడా తాకట్టు పెట్టినట్లుగా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆ రివాల్వర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ధ్రువీకరించని అధికారులు.. ఆ ఎస్సైని సస్పెండ్‌ చేశారు.

Updated Date - Nov 27 , 2025 | 04:18 AM