Deputy CM Bhatti Vikramarka: సమ సమాజ స్థాపనే అంబేడ్కర్ లక్ష్యం
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:49 AM
అసమానతలు లేని సమాజం కోసం అంబేడ్కర్ నిరంతరం కృషి చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
బాబా సాహెబ్‌కు భట్టి విక్రమార్క నివాళి
మార్గదర్శి అంబేడ్కర్ : రాంచందర్‌రావు
కవాడిగూడ/హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : అసమానతలు లేని సమాజం కోసం అంబేడ్కర్ నిరంతరం కృషి చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాన్యుడికి కూడా ఓటు హక్కు కల్పించి మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో దేశ యువత నడవాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అంబేడ ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఆయన విగ్రహానికి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. కాగా, ఎస్సీ వర్గీకణ చట్టానికి సవరణలు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మాల సంఘాల జేఏసీ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ నాయకులు భట్టి విక్రమార్కను కోరారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేయడంతో అంబేడ్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని భట్టి హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నిర్మాత దిల్‌రాజు, పలువురు దళిత సంఘాల నేతలు, సీపీఎం నాయకులు, అంబేడ్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దేశానికి దిశ నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని రాంచందర్‌రావు కొనియాడారు. రాజ్యాంగాన్ని గౌరవించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం శాసనసభ ఆవరణలోని ఆయన విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు.