Stampede Case: ఏ11గా అల్లు అర్జున్
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:55 AM
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసుల చార్జిషీట్
యాజమాన్యం నిర్లక్ష్యం, అల్లు అర్జున్ రాకతోనే ఘటన!
ఏ1, ఏ2 గా థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు
నిందితులు మొత్తం 23 మంది
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశారు. ఆ ఘటనలో మహిళ మృతి, ఆమె కుమారుడు జీవచ్ఛవంగా మారడానికి.. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు అల్లు అర్జున్ రాక కూడా కారణమంటూ ఆయన్ను ఏ-11గా చేర్చారు. ఈ మేరకు చార్జిషీట్‌లో 23 మంది నిందితుల పేర్లను చేర్చారు. ఈ నెల 24నే కోర్టులో ఈ చార్జిషీటు దాఖలు చేసినా.. ఆ వివరాలను శనివారం వెల్లడించారు. చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్న వివరాల మేరకు.. గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ రావొద్దని, శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా.. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు, అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసుల మాట లెక్క చేయకుండా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, థియేటర్‌కు కొంత దూరం నుంచే ఓపెన్ టాప్ జీపులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడం, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సాఽధారణ ప్రజలను, అభిమానులు నెట్టివేయడంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే ప్రేక్షకురాలు చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితికి చేరి.. ఇప్పటికీ బెడ్‌మీదనే చికిత్సపొందుతున్నాడు.
ఈ ఘటనలో థియేటర్ నిర్వాహకులతోపాటు అల్లు అర్జున్, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేసి జైలుకు తరలించామని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేశామని, 50 మంది సాక్షులను విచారించామని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ తెలిపారు. అల్లుఅర్జున్ సహా 23 మంది ఈ దుర్ఘటనకు బాధ్యులని గుర్తించామని చెప్పారు. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులను ఏ1, ఏ2గా, అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చామని తెలిపారు. మొత్తంగా థియేటర్ యాజమాన్యం, సిబ్బంది 10 మంది, 8 మంది బౌన్సర్లు, అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బంది నలుగురు నిందితుల్లో ఉన్నారని వివరించారు. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, బలమైన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేఽశామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 304 పార్టు-2 (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసీ సంబంధిత చర్యకు పాల్పడటం) కింద అభియోగాలు నమోదు చేశామని.. నేరం రుజువైతే నిందితులకు 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు.