Kaloji University: కాళోజీ వర్సిటీలో అక్రమార్కులు
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:37 AM
సాధారణ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే ఏం చేస్తారు?.. పాస్ అయ్యే దాకా కష్టపడి చదువుతారు... కానీ, భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన ఐదుగురు విద్యార్థులు అడ్డదారి తొక్కారు.....
వైద్య విద్య పీజీ పరీక్షల్లో గోల్ మాల్
ఫెయిలైన ఐదుగురికి మార్కులు కలిపిన వైనం
పునః మూల్యాంకనమే లేనప్పుడు ఇదెలా సాధ్యం?
ఖాళీ పేజీల్లో మళ్లీ రాతలు రాసినట్టు అనుమానాలు
వీళ్లందరూ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన వారే
రీకౌంటింగ్ తర్వాత మరో యూజీ విద్యార్థి కూడా పాస్
పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు
సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సాధారణ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే ఏం చేస్తారు?.. పాస్ అయ్యే దాకా కష్టపడి చదువుతారు... కానీ, భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన ఐదుగురు విద్యార్థులు అడ్డదారి తొక్కారు. అక్రమంగా మార్కులు వేయించుకుని పాస్ అయ్యారు. ఈ తతంగం వెనుక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని కొందరు అక్రమార్కుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఫెయిలై.. మళ్లీ పాస్ అయిన వారంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కావడం గమనార్హం. మరోవైపు.. ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీ యూజీ విద్యార్థి ఫెయిలైనా... రీకౌంటింగ్‌లో పాస్ అయ్యాడు. రీకౌంటింగ్ తర్వాత ఓ విద్యార్థి పాస్ కావడం కాళోజీ యూనివర్సిటీ చరిత్రలోనే ఇదే తొలిసారి.
పక్కాగా నిర్వహిస్తామని చెబుతున్నా..
వైద్య విద్య పీజీ పరీక్ష ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడ్డాయి. ఓ ప్రైవేటు వైద్యవిద్య కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదు. కానీ, ఆ తర్వాత కొద్ది రోజులకే పాస్ అయ్యారు. ఇదెలా సాధ్యమైందని సహచర మెడికోలు ఆరా తీయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అండర్, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షల్లో విద్యార్థులు జవాబులు రాసేందుకు 30 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. దానిపై విద్యార్థి హాల్ టికెట్ నంబరుతోపాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ బుక్‌లెట్‌లో జవాబులన్నీ రాశాక... ఇంకా పేపర్లు మిగిలి ఉంటే... వాటిపై పెద్దగా కొట్టివేత (‘ఎక్స్’ గుర్తు) మార్క్ వేయాలి. అలా క్రాస్ మార్కింగ్ చేసిన తర్వాతే ఇన్విజిలేటర్లు ఆయా జవాబు పత్రాలను తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని స్కాన్ చేసి.. జంబ్లింగ్ పద్ధతిలో వివిధ కాలేజీలకు పంపుతారు. సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు.. వాటిని ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం చేస్తారు. ఇదంతా చాలా పకడ్బందీగా ఉంటుంది. చివరకు సదరు సాఫ్ట్‌వేరే.. ఒక్కో జవాబుకు వేసిన మార్కులన్నీ లెక్కించి మొత్తం మార్కులను వెల్లడిస్తుంది. అయితే, ఈ ఐదుగురు విద్యార్థుల జవాబు పత్రాల్లో కొట్టివేత మార్కు వేసిన పేజీల్లోనూ జవాబులు రాసి ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా కొట్టివేత మార్కు వేసిన పేజీల్లో రాసిన జవాబులను పరిగణనలోకి తీసుకోరు.
కానీ, ఆయా జవాబులకు మళ్లీ మార్కులు వేసి, పాస్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా మార్కులు కలిపినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పీజీ పరీక్షలకు సంబంధించి రీవ్యాల్యుయేషన్ అనేదే లేదు.. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఇదంతా ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, హైదరాబాద్ సమీపంలో ఉండే ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీ విద్యార్థి సైతం ఎంబీబీఎ్‌సలో ఫెయిల్‌కాగా, ఆ తర్వాత రీకౌంటింగ్‌లో పాస్ అయ్యాడు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం చరిత్రలోనే రీకౌంటింగ్‌లో ఓ విద్యార్థి పాస్ కావడం ఇదే తొలిసారి అని విద్యార్థులు చెబుతున్నారు. దీని వెనుక కూడా భారీ మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వర్సిటీ లాగిన్ తనిఖీ చేస్తే...
‘‘విద్యార్థులు పాస్ అయినా... ఫెయిలైనా.. వారికి వచ్చిన మార్కులు వివరాలన్ని యూనివర్సిటీ అంతర్గత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. వాటిలో మార్పులు చేయాలంటే సంబంధిత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు తెలిసిన వారే చేయగలరు. ఎన్నిసార్లు లాగిన్ అయ్యారు? ఎప్పుడెప్పుడు లాగిన్ అయ్యారు? ఏమేమి మార్పులు చేశారు? అన్న వివరాలు కూడా నమోదై ఉంటాయి. ఒక్క సారి సాంకేతిక నిపుణులతో తనిఖీ చేయిస్తే...అసలు బండారం బయటపడుతుంది’’ అని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైద్య విద్య పరీక్షలను అపహస్యం చేస్తూ.. అక్రమాలకు పాల్పడిన వైనంపై సమగ్ర విచారణ చేపట్టాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు.