TS AIDS Control Officials: టీశాక్‌లో కలెక్షన్ కింగ్!
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:27 AM
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీశాక్)లో వసూళ్ల పర్వం చోటు చేసుకుంది. ఎయిడ్స్ రోగులకు సేవలందించే స్వచ్ఛంద సంస్థల...
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వసూళ్ల పర్వం
హెచ్‌ఐవీ ఎయిడ్స్ ఎన్‌జీవోలే టార్గెట్
ఎంవోయూలు రద్దు చేస్తామంటూ బెదిరించి కమీషన్లు వసూలు చేసిన వైనం
రెండునెలల్లో రూ.3 కోట్లకు పైగా..
ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి వసూళ్ల బాధ్యత
ఆ ఉద్యోగికి బదిలీ.. దాంతో వెలుగులోకి
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీశాక్)లో వసూళ్ల పర్వం చోటు చేసుకుంది. ఎయిడ్స్ రోగులకు సేవలందించే స్వచ్ఛంద సంస్థల(ఎన్‌జీవో) నుంచి టీశాక్ అధికారులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము అడిగినంత ఇవ్వకుంటే టీశాక్‌తో చేసుకున్న అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ) రద్దు చేస్తామని బెదిరిస్తూ రాష్ట్రంలోని వివిధ ఎన్జీవోల నుంచి రెండు నెలల్లో రూ.3కోట్లకు పైగా వసూళ్లు చేశారు. ఈ వసూళ్ల వెనుక టీశాక్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సదరు అధికారి ఎన్జీవోల నుంచి వసూళ్లు చేసే పనిని ఓ కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించగా చేతివాటం ప్రదర్శించాడు. దీంతో సద రు ఉన్నతాధికారి కాంట్రాక్టు ఉద్యోగిని పెద్దపోస్టు నుంచి తప్పించి పనిలేని విభాగానికి బదిలీ చేశారు. ఈ బదిలీ వల్ల వసూళ్లు విషయం బయటికొచ్చింది.
న్యాకో నిధుల్లో వాటాలు
హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాక్స్ ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తర్వా త టీశాక్‌గా మారింది. ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ కార్యక్రమాల అమలులో ఎన్‌జీవోల భాగస్వామ్యం కీలకం. అర్హత ఉన్న ఎన్‌జీవోలను ఎంపిక చేసి వాటి తో ఎంఓయూ చేసుకుని టీశాక్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. హెచ్‌ఐవీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే ఎన్‌జీవోలు రాష్ట్రంలో 63 ఉన్నాయి. ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, డ్రగ్స్ ఇంజక్షన్స్ ద్వారా వ్యాప్తి చేసేవారు, హిజ్రాలు-ట్రాన్స్‌జెండర్స్, ట్రక్ డ్రైవర్లు, వలస కార్మికులు.. ఈ ఆరు విభాగాల్లో ఒక దానిని ఎంపిక చేసుకొని ఎన్‌జీవోలు పని చేస్తుంటాయి. కొన్ని సంస్థలు కేవలం మహిళా సెక్స్ వర్క్‌ర్లపై, మరికొన్ని గే(మెన్‌టూమెన్ సెక్స్)ల కోసం, ఇంకొన్ని అన్ని రకాల వారి కోసం సేవలందిస్తుంటాయి. హెచ్‌ఐవీపై అవగాహన కల్పించడం, కండోమ్స్ వాడకం, ప్రతీ 3 నెలలకోసారి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయించడం, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్సకు మద్దతివ్వడం వంటి కార్యక్రమాలను ఎన్‌జీవోలు చేపడతాయి. ఎన్‌జీవోలకు ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ ప్రతీ ఏటా లక్ష్యం నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యం (హెచ్‌ఐవీ రోగులు, ప్రభావితులు) ఆధారంగా టీశాక్ బడ్జెట్ కేటాయిస్తుంది. ఈ నిధులు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ(న్యాకో) నుంచి శాక్స్‌కు వస్తాయి. లక్ష్యాన్ని బట్టి రాష్ట్రంలోని ఒక్కో సంస్థకు ప్రస్తుతం సగటున రూ.30 లక్షల నుంచి కోటిన్నర వరకు టీశాక్ బడ్జెట్ ఇస్తోంది. మూడు నెలలకు ఓసారి బడ్జెట్ విడుదల అవుతుంటుంది. ఎన్‌జీవోలకు చేరే ఈ నిధుల నుంచే టీశాక్ అధికారులు వాటాలు తీసుకుంటున్నారు.
10 శాతం కమీషన్
టీశాక్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ఏటా ఒక్కో ఎన్‌జీవోకు కేటాయించే బడ్జెట్ నుంచి 10ు మొత్తాన్ని నగదు రూపంలో కమీషన్‌గా ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఆ ఉన్నతాధికారి తరఫున హైదరాబాద్‌లోని టీశాక్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ హోదా కలిగిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి వసూ ళ్లు చేసేవారు. నేరుగా తామే వెళ్లి వసూళ్లకు పాల్పడితే సమస్యలు వస్తాయని భావించి ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులను కూడా రంగంలోకి దించారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో వసూళ్ల కోసం ఓ మహిళను పంపారని సమాచారం. అడిగినంత ఇవ్వకపోతే టీశాక్‌తో ఉన్న ఎంవోయూను రద్దు చేస్తామని బెదిరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కసారి ఒప్పందం రద్దు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. దీంతో స్వచ్ఛంద సంస్థలు కూడా చేసేది లేక అడిగినంత ఇచ్చుకున్నట్లు సమాచారం. కొన్ని సంస్థలు 5ు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఇలా, సగటున ఒక్కొ సంస్థ నుంచి, వారి బడ్జెట్ ఆధారంగా రూ.3లక్షల నుంచి రూ.10లక్షల మధ్య వసూ లు చేసినట్లు చెబుతున్నారు. ఎన్‌జీవోల కోసం టీశాక్ బడ్జెట్‌లో రూ.39 కోట్లు కేటాయించగా.. 10ు కమీషన్ కింద గత రెండు నెలల్లోనే మూడు కోట్ల వసూలు చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ఎన్‌జీవోలు తమ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే ఇచ్చి(బ్యాంకు ఖాతాల్లో జమ చేసి) వెంటనే నగదు రూపంలో వెనక్కు తీసుకుంటున్నాయి. స్వచ్ఛంద సంస్థల నుంచి వసూళ్లుకు పాల్పడుతున్న టీశాక్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్‌జీవోలు కోరుతున్నారు.