Share News

Film Chamber: చిత్రపురిపై విచారణ ఎప్పుడో!?

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:09 AM

చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ.. ఇది సినీ కార్మికులు తమ కోసం ఏర్పాటు చేసుకున్న గృహ సముదాయానికి సంబంధించిన సంస్థ. ఫిల్మ్‌ చాంబర్‌..

Film Chamber: చిత్రపురిపై విచారణ ఎప్పుడో!?

  • హౌసింగ్‌ సొసైటీలో అవకతవకలు!

  • అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్‌

  • రంగంలోకి దిగిన ఇద్దరు ఫిల్మ్‌చాంబర్‌ సభ్యులు!

  • చిత్రపురి సొసైటీ సభ్యులను కాపాడే యత్నం

  • వ్యక్తిగత లబ్ధి కోసం సంస్థలను వాడుకుంటున్నారు!

  • ఫైనాన్షియర్‌ నుంచి 22 కోట్లు తీసుకున్న సొసైటీ

  • 45 అంతస్తుల ‘సఫైర్‌ సూట్‌’ నిర్మిస్తున్నట్లు ప్రకటన

  • ఫ్లాట్ల విక్రయాలతో అప్పులు తీర్చవచ్చని యోచన

  • ఆ భవనానికి అనుమతులు రద్దు చేసిన హైడ్రా?

  • 22 కోట్లకు మధ్యవర్తిగా ఉన్న ఫిల్మ్‌చాంబర్‌ సభ్యుడు అతనికి ఇబ్బంది ఉండకూడదనే ఎన్నికల్లో జాప్యం?

(సినిమా డెస్క్‌)

చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ.. ఇది సినీ కార్మికులు తమ కోసం ఏర్పాటు చేసుకున్న గృహ సముదాయానికి సంబంధించిన సంస్థ. ఫిల్మ్‌ చాంబర్‌.. ఇది సినీ రంగ ప్రముఖులు ఏర్పాటు చేసుకున్న స్వీయ నియంత్రణ విభాగం. అలాంటి ఈ రెండు సంస్థలకు మధ్య సంబంధం ఏంటి? వాస్తవానికి సినీ పరిశ్రమ ప్రయోజనాలు తప్ప ఈ రెండింటి మధ్య ఇతర సంబంధాలు ఉండకూడదు. కానీ, ఈ రెండు పాలక మండళ్లకు చెందిన కొందరు సభ్యుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాల వల్ల చాంబర్‌ ఎన్నికలు జాప్యం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అలాగే హౌసింగ్‌ సొసైటీ అక్రమాలపై విచారణ జరగకుండా చాంబర్‌ సభ్యులు కొందరు రంగంలోకి దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


ఒకప్పటి తెలుగు సినిమాల్లో ఒక రాజకీయ నాయకుడు, ఒక న్యాయవాది, ఒక వాణిజ్యవేత్త కలిసి ముఠాగా ఏర్పడి విలనిజం చేసేవారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఆయా వర్గాల ప్రముఖులందరూ కలిసిపోతే ప్రజలకు ఎలాంటి హాని జరుగుతుందో చెప్పడానికి దర్శకులు సినిమాల్లో వారి పాత్రలను చూపించేవారు. ఇప్పుడు చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ, ఫిల్మ్‌ చాంబర్‌ల మధ్య నెలకొన్న సంబంధాలు కూడా ఇలాంటివేనని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు ఈ రెండు సంస్థలనూ వాడుకుంటున్నారని చెబుతున్నారు. చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ ఒక బ్యాంకు వద్ద తీసుకున్న అప్పును చెల్లించడం కోసం ప్రముఖ సినీ ఫైనాన్షియర్‌ చదలవాడ శ్రీనివాసరావు దగ్గర రూ.22 కోట్లు తీసుకుంది. ఆయన కుమారుడు రాజేశ్‌ పేరుతో ఇచ్చిన ఈ మొత్తానికి చాంబర్‌ పాలక మండలి సభ్యుడొకరు మధ్యవర్తిగా వ్యహరించారు. ‘‘చట్టరీత్యా ఇది చెల్లదని మేం అనేక సార్లు కమిటీకి చెప్పాం. ఉత్తరాలు రాశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు’’ అని చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ సభ్యుడు సతీశ్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చిత్రపురి సమస్య ప్రముఖంగా మారడంతో కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగింది. చిత్రపురి వ్యవహారాలన్నీ కొలిక్కి తీసుకొస్తామని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. దీంతో చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ పాలకమండలి సభ్యుల్లో కొంత అలజడి చెలరేగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్రపురి సొసైటీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఫిల్మ్‌ చాంబర్‌ పాలక మండలికి చెందిన ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగారని కొందరు ఆరోపిస్తున్నారు. వీరు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులతో మాట్లాడి చిత్రపురి సొసైటీ పాలక మండలి వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటి దాకా చిత్రపురి వ్యవహారాలపై కోర్టుల్లో కేసులు వేసిన ఐదుగురికి.. సినీ రంగానికి చెందిన వారని చాంబర్‌ ముందు నిరూపించుకోవాలంటూ జిల్లా సహకార అధికారి నుంచి నోటీసులు అందాయి. వారు చాంబర్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు. అయినా ఆ ఐదుగురి సభ్యత్వాలను చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ రద్దు చేసింది. దీంతో చిత్రపురి కాలనీ పాలక మండలిని వ్యతిరేకించే వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.


తెరపైకి ‘సఫైర్‌ సూట్‌’..!

ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలోనే చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ తమ వద్ద ఖాళీగా ఉన్న 3.5 ఎకరాల భూమిలో సఫైర్‌ సూట్‌ అనే 45 అంతస్తుల భవంతిని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. దీని విలువ రూ.200 కోట్ల వరకూ ఉంటుంది. దీనికి హెచ్‌ఎండీఏ అనుమతులూ లభించాయి. అయితే హైడ్రా ఏర్పాటైన తర్వాత ఈ భూమి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉండడంతో అనుమతులు రద్దు చేశారని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, సఫైర్‌ సూట్‌ భవంతికి అనుమతులు ఉన్నట్లు చెబుతూ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో బ్రోచర్‌ ఆవిష్కరించారు. ‘‘ఆ సమయంలోనే ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడికి ఒక రోహౌస్‌ కేటాయించారు. దీని మార్కెట్‌ విలువ రూ.3కోట్లు ఉంటుంది. గతంలో మా వద్ద భరత్‌భూషణ్‌ అనే ఒక సభ్యుడు ఉండేవారు. ఆయన పేరును వాడి తప్పుడు పత్రాలతో ఈయనకు రోహౌస్‌ ఇచ్చారు. మేం వారిద్దరి వివరాలు సేకరించాం. ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు సహా వివరాలన్నింటినీ అధికారులకు అందించాం. కానీ, దానిపై ఇప్పటిదాకా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు’’ అని కస్తూరి శ్రీనివాస్‌ చెప్పారు. ఈ ఏడాది అమెరికాలో జరిగిన తానా సమావేశాలకు చిత్రపురిపాలక మండలిలో కొందరు, ఫిల్మ్‌ చాంబర్‌కు సంబంధించిన మరికొందరితోపాటు ఓ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కలిసి వెళ్లారని.. అక్కడ సఫైర్‌ సూట్‌లో ఫ్లాట్లు కొనాలంటూ ఎన్నారైలను కోరారని సభ్యులు పేర్కొంటున్నారు. ‘‘ప్రస్తుతం మణికొండలోని అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు రూ.10వేల వరకు ఉంది. సఫైర్‌ సూట్‌లో రూ.7వేలకే ఇస్తామని చెప్పడంతో కొందరు ఎన్నారైలు నన్ను సంప్రదించారు. సఫైర్‌ సూట్‌కి అనుమతులే లేవనిచెప్పాను’’ అని చిత్రపురి కాలనీకి చెందిన రమేశ్‌ చెప్పారు. జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఒకప్పటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు, ప్రస్తుత చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడికి సన్నిహితుడని..వీరందరూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వాములని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు.

అందుకే చాంబర్‌ ఎన్నికల్లో జాప్యం..!

మెజారిటీ సభ్యులు కోరుకుంటున్నట్లు ఫిల్మ్‌చాంబర్‌కు ఎన్నికలు జరిగితే కొత్త కమిటీ ఏర్పడుతుంది. అప్పుడు చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీతో ఫిల్మ్‌చాంబర్‌ లావాదేవీలన్నీ బయటికి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ‘‘చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ చదలవాడ శ్రీనివాసరావుకు ఇంకా సొమ్ము చెల్లించలేదు. ఈ సొమ్ము చెల్లించకపోతే ఆ ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న ఫిల్మ్‌చాంబర్‌ పాలక మండలి సభ్యుడికి ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుంది. సఫైర్‌ సూట్‌ నిర్మాణం ప్రారంభమైతే చిత్రపురి హౌసింగ్‌ సొసైటీకి సొమ్ములు వస్తాయి. దాంతో సొసైటీ అప్పులు కొంతవరకు తీరతాయి. అప్పటిదాకా చాంబర్‌ ఎన్నికలు జరగకుండా జాప్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని చాంబర్‌ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. వీటన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాలని చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ, ఫిల్మ్‌చాంబర్‌ సభ్యులు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 08:13 AM