Kalvakuntla Kavitha Accused: సింగరేణిలో ప్రతి కాంట్రాక్టుకూ 25శాతం కమీషన్లు!
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:15 AM
సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రతి కాంట్రాక్ట్‌కు 25శాతం కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని, అందులో 10 శాతం వాటా కాంగ్రెస్..
అందులో 10% వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోంది
ఈ అంశంపై సీఎం స్పందించాలి: కవిత
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రతి కాంట్రాక్ట్‌కు 25శాతం కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని, అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి కార్యాలయంలో హెచ్‌ఎంఎస్, సింగరేణి జాగృతి (ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణిలో అవినీతిపైౖ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తక్షణమే స్పందించాలన్నారు. లేదంటే ఈ విషయమై సీబీఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. సింగరేణికి రూ.42వేల కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. టీబీజీకేఎస్ నాయకులు అవినీతికి పాల్పడొద్దని గతంలోనే తాను హెచ్చరించినా.. పట్టించుకోలేదన్నారు. నిన్నటిదాకా ఆ సంఘం గౌరవాధ్యక్షురాలిగా తానే ఉన్నానని, కానీ.. అక్కడ జరిగిన అంశాలపై కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.