Telangana Minority Affairs Minister Azaruddin: త్వరలో వక్ఫ్ భూములన్నీ ఆన్‌లైనో
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:38 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటి పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు....
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటి పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. ఆస్తుల వివరాలన్నీ ఆన్‌లైన్లో నమోదు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మీడియా సమావేశంలో చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమ్మిద్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో గడువులోపు నమోదు చేయలేకపోయామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63,180 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, వీటిలో 46 వేల ఎకరాల భూములు పోర్టల్‌లో నమోదు కాలేదన్నారు. పోర్టల్‌లో భూముల వివరాలు నమోదు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు. మైనార్టీ గురుకులాల్లో కలుషితాహారం తిని విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. కలుషిత ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.విద్యార్థులకు భోజనం పెట్టే ముందు అక్కడి అధికారులు, సిబ్బంది తినాలని ఆదేశించామని తెలిపారు. రాబోయే కాలంలో మైనార్టీ బడ్జెట్ పెంచేందుకు కృషి చేస్తున్నామని అజారుద్దీన్ తెలిపారు.