Share News

Meet PM Modi: అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:02 AM

బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు, అఖిలపక్ష....

Meet PM Modi: అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి

  • న్యాయ పోరాటం చేస్తూనే ప్రధానిని కలవాలి

  • జాజుల, కోదండరాం, వీహెచ్‌

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌, అక్టోబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. బంజారాహిల్స్‌లోని శనివారం కళింగ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ‘బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ేస్ట- పరిష్కార మార్గాలు, భవిష్యత్‌ కార్యాచరణ’పై అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, ఈరవత్రి అనిల్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీజేపీ నేత ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, సీపీఎం నాయకుడు బండారు రవికుమార్‌, సీపీఐ (ఎంఎల్‌) నాయకుడు గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు స్టేపై ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు ప్రధాని వద్దకు అఖిలపక్ష నాయకులను తీసుకువెళ్లాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్ల రక్షణకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత తీసుకోవాలన్నారు. సమావేశంలో జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. అఖిలపక్ష బృందంతో ప్రధాని నరేంద్రమోదీని కలిసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సమాజం రోడ్లపైకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి కలవారు ఏకం కావాలని ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలో జేఏసీతో ఐక్య పోరాటం చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, అవసరమైన పక్షంలో 50 శాతం దాటవచ్చని కోర్టులు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని సమావేశంలో బీసీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఢిల్లీలో కార్యాచరణకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. హైకోర్టు ేస్టపై సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్‌ దాఖలు చేస్తామని, రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఈ సమావేశంలో 30కి పైగా బీసీ కుల సంఘాలు, 80 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, నాయకులు, యూనివర్సిటీల ఆచార్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 04:02 AM