Floodwaters: వరదంతా సముద్రంలోకే
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:20 AM
కృష్ణా, గోదావరి బేసిన్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న వరద అంతా సముద్రం పాలవుతోంది. వరదను గరిష్ఠంగా నిల్వ చేసే రిజర్వాయర్లు లేకపోవడంతో.
తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండల్లా జలాశయాలు
వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు విడుదల
ఈ వాటర్ ఇయర్‌లో ఇప్పటికే గోదావరి బేసిన్‌లో.. 2,350, కృష్ణాలో 726 టీఎంసీలు కడలిలోకి
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి బేసిన్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న వరద అంతా సముద్రం పాలవుతోంది. వరదను గరిష్ఠంగా నిల్వ చేసే రిజర్వాయర్లు లేకపోవడంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదలాల్సివస్తోంది. ఈ వాటర్ ఇయర్ (2025 జూన్ 1)లో ఇప్పటికే గోదావరి కింద 2,350 టీఎంసీలు, కృష్ణాలో 726 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. కృష్ణా బేసిన్‌ను పంచుకుంటున్న రాష్ట్రాల్లో భారీ రిజర్వాయర్లు లేవు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన నాగార్జునసాగర్, శ్రీశైలం మాత్రమే అతిపెద్ద రిజర్వాయర్లు. వీటిలో శ్రీశైలం సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, నాగార్జునసాగర్ సామర్థ్యం 312.05 టీఎంసీలు. ఇక కర్ణాటకలోకి ఆల్మట్టి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా, మహారాష్ట్రలో బీమా నదిపై ఉజ్జయిని జలాశయం సామర్థ్యం 121 టీఎంసీలు, తుంగభద్ర జలాశయం సామర్థ్యం 105.79 టీఎంసీలే. గోదావరి బేసిన్‌లో పరిమిత సంఖ్యలోనే రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలోనూ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ శివారు పైఠన్‌లో 102 టీఎంసీల సామర్థ్యం కలిగిన జయక్వాడీ రిజర్వాయర్, తెలంగాణలో 80 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరామ్‌సాగర్‌లే పెద్దవి. ఆ తర్వాత ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. 194 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పూర్తయితే గోదావరిలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు కానుంది. కాగా, శనివారం కృష్ణా బేసిన్‌లో చిట్టచివరన ఉన్న ప్రకాశం బ్యారేజీకి 30,876 క్యూసెక్కుల వరద రాగా సముద్రంలోకి వదిలేశారు. గోదావరిలో చిట్టచివరన ఉన్న రాజమహేంద్రవరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 7.98 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. దీనిని కూడా పూర్తిగా కిందికి వదిలారు.