Alay Balay Cultural Event: కులమతాల పేరుతో ప్రజల్లో చీలికకు కొందరి యత్నాలు!
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:49 AM
హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమం ధూంధాంగా సాగింది...
నేపాల్‌లాంటి దేశాల్లో జరిగిందే ఇక్కడా జరుగుతుందనుకుంటున్నారు
వారికి నిరాశ తప్పదు.. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం: వెంకయ్య
హైదరాబాద్‌కు అలయ్ బలయ్ ప్రత్యేకం: కిషన్‌రెడ్డి
సామాజిక ఐక్యత మరింత బలోపేతం: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
ధూంధాంగా దత్తన్న అలయ్ బలయ్
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, న్యూఢిల్లీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమం ధూంధాంగా సాగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. కులం, మతం, వర్గం, వర్ణం, జాతి పేరిట కొంతమంది దేశ ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నేపాల్ వంటి దేశాల్లో ఏదో జరిగిందని, భారత్‌లో కూడా అలా జరగవచ్చునని కొంతమంది ఆశలు పెట్టుకున్నారని చెప్పారు అయితే అలాంటి వారు నిరాశ చెందక తప్పదని.. ఎందుకంటే.. వేషభాషలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్ విశిష్టత అని.. చిన్నచిన్న విభేదాలు ఏర్పడినా వాటిని పరిష్కరించుకొని అంతా భారతీయులం అనే భావన దేశప్రజల్లో ఉందని వివరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అలయ్ బలయ్ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని.. హైదరాబాద్‌కు ప్రత్యేకం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజలకు మోదీ అలయ్ బలయ్ ఇచ్చారని పేర్కొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, దేశంలో భిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్నా, అన్ని పండుగల ఉద్దేశం.. అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలన్నదేనన్నారు. ‘మానవ సేవే మాధవ సేవ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లుగా మానవీయ విలువలతో కూడిన సేవ అవసరం అని పేర్కొన్నారు. మన సంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ముందుతరాలు తెలుసుకోవడానికి అలయ్ బలయ్ ఒక చక్కటి కార్యక్రమం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దసరా పండుగ మరుసటి రోజు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతరంగా నిర్వహిస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హాస్య నటుడు బ్రహ్మనందం మాట్లాడుతూ అలయ్ బలయ్ అంటే హృదయ పూర్వకగా ప్రేమను పంచుకోవడమేనన్నారు.

హనుమంతుడిని శ్రీరాముడు అలింగనంచేసుకున్నారని, ఆ కాలం నుంచే ఈ అలయ్ బలయ్ ఉందని వివరించారు. రాజకీయాలకు అతీతంగా నేతలంగా ఒకే వేదికపై రావడం తమలో నమ్మకం, ఆత్వవిశ్వాసం పెంచిందని సినీనటుడు నాగార్జున అక్కినేని పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు వస్తే అందరూ మద్దతుగా నిలుస్తారనే నమ్మకం ఏర్పడిందన్నారు. వచ్చే దసరాకు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని రాయసీమ, ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించాలని, అక్కడి సంస్కృతిని మార్చాల్సిన అవసరముందని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. దత్తాత్రేయ అందరిని ప్రేమిస్తారని, ఆయన అజాత శత్రువని, భిన్నప్రాయాలున్న వారిని ఒక వేదిక మీదకు తీసుకువస్తున్నారని మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. అలయ్ బలయ్‌ని గిన్నిస్ బుక్‌లో రికార్డు చేయాల్సిన అవసరముందన్నారు. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం సమానత్వానికి ప్రతీక అని అన్నారు. బండారు దత్తాత్రేయకు ఎవరు సాటి రారని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. ఇది అద్భుత కార్యక్రమం అని కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మానవ సంబంధాలకు ప్రతీక అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో, రాజకీయ పరంగా నేతలుగా ఒకరికొకరం తిట్టుకుంటామని, కానీ అలయ్ బలయ్ వేదిక మాత్రం అందరిని కలిసికట్టుగా ఉంచుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను బండారు దత్తాత్రేయ సత్కరించారు. అలయ్ బలయ్‌ని 2005లో ప్రారంభించామని, 21 ఏళ్లుగా కొనసాగుతోందని వివరించారు. ఇది సంప్రదాయం కాదని, తెలంగాణ ఆత్మ, జీవన విలువ ప్రతికగా అభివర్ణించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి అర్జున్ రాయ్ మేఘ్వాల్, విశ్రాంత సీజేఐ ఎన్వీ రమణ, మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రఘునందన్‌రావు, జితేందర్‌రెడ్డి అజీజ్‌పాషా, కోదండరాం, అంజిరెడ్డి, మందకృష్ణ మాదిగ, కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
సోదరభావాన్ని పెంపొందించే వేడుక
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం
తెలంగాణలో ఏటా నిర్వహిస్తున్న అలయ్‌బలయ్ సోదరభావాన్ని పెంపొందించే వేడుక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ వార్షిక ఉత్సవం, తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతోందని తెలిపారు. అలయ్ బలయ్ వేడుక సందర్భంగా, రాష్ట్రపతి సందేశం పంపించారు. ఐక్యత, సామాజిక విలువల వ్యాప్తికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
నాటుకోడి పులుసు, చికెన్ కర్రీ
అలయ్ బలయ్ కార్యక్రమంలో వివిధ రకాల వంటలు ఘుమఘుమలాడాయి. శాకాహారుల కోసం రాగి సంగటి, పాలకూర పప్పు, వంకాయ కుర్మా, దోసకాయ, టమాటా పచ్చడి, గోబిప్రై, పాలక్‌పన్నీర్, బటర్ పన్నీర్, పచ్చిపులుసు, పప్పుచారు, సర్వపిండి, గారెలు, డబల్‌కామీఠా ఏర్పాటు చేశారు. మాంసాహార ప్రియుల కోసం నాటుకోడి పులుసు, బోటీ కర్రీ, లీవర్ కర్రీ, పాయ, మటన్ బిర్యానీ, తలకాయ కూర, చేపలు, రొయ్యల ఫ్రై, హలీమ్ వండారు. వంటల్లో 12 క్వింటాళ్ల చికెన్, 40క్వింటాళ్ల మటన్ ఉపయోగించారు. కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.