Bandi Sanjay Criticism: అకున్ సబర్వాల్ నివేదిక ఏమైంది
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:50 AM
డ్రగ్స్ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాటి డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు
అందుకే అకున్‌ను కేసు నుంచి తప్పించారు
కోర్టుకు ఆధారాలివ్వని నాటి సీఎస్ సోమేశ్.. బండి విమర్శలు
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పండుగలు, న్యూఇయర్ వేడుకలు అప్పుడు మాత్రమే కేసులంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. డ్రగ్స్ నిర్మూలన అంశంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ కేసులో ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అసలు ఆ విచారణ నివేదిక ఏమైందని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన చేశారు. నాటి కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారని, విచారణ సందర్భంగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితులకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డులు బయటకు వస్తే తన కుటుంబసభ్యుల రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందన్న భయంతో నాటి సీఎం కేసీఆర్.. అకున్ సబర్వాల్‌ను కేసు నుంచి హఠాత్తుగా తప్పించారని ఆరోపించారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్న నాటి సీఎస్ సోమేశ్ కుమార్ వాటిని న్యాయస్థానంలో సమర్పించలేదని, తదుపరి విచారణ బృందానికి కూడా అప్పగించలేదని సంజయ్ తెలిపారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకొని విచారిస్తేనే నాటి కేసులో వాస్తవాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు.
అకున్ సబర్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఏమైందో వెల్లడించాలని రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వానికి చిత్తశుద్థి ఉంటే అకున్ సబర్వాల్ లాంటి అధికారికి డ్రగ్స్ కేసు బాధ్యతలను తిరిగి అప్పగించాలని అన్నారు. కాగా, డ్రగ్స్ కేసుల్లో విచారణ అంశంలో ఈగల్ టీమ్‌కు చట్టపరంగా అధికారాలు ఉన్నాయా ? అని బండి సంజయ్ ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. ఈగల్ టీమ్‌లోని కొందరు అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని ఆరోపించారు. ఇటీవల చేసిన దాడిలో పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.