Akhilesh Yadav: ఏపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:02 AM
తెలుగు రాష్ట్రాల నాయకులకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు...
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా తెలుగు రాష్ట్రాల సొంతం
యూపీలో బీజేపీని వెనక్కు నెట్టేశాం
యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్
సీఎం రేవంత్‌తో మర్యాదపూర్వక భేటీ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాల నాయకులకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అఖిలేశ్ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీని డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా హైదరాబాద్‌లో స్థాపించారనే విషయం చాలా మందికి తెలియదన్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులంతా సమ్మేళనంలో కలిసి ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణగా రాష్ట్రం విడిపోయినా యాదవ సమాజం సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక, యూపీలో తాము బీజేపీని వెనక్కు నెట్టేశామని, ఏపీ నేతలు మాత్రం బీజేపీకి సహకరిస్తున్నారని అఖిలేశ్ ఈ సందర్భంగా అన్నారు. ఎన్డీయేలోని పార్టీల సహకారంతో బీజేపీ నేతలు గద్దెనెక్కారని విమర్శించారు. దేశ రక్షణకు అందరూ కలిసి పని చేయాలని సూచించారు. సమాజ్‌వాదీకి ఇతర పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను చిన్న వయస్సులోనే యూపీ ముఖ్యమంత్రి అయ్యానని, యువతకు రాజకీయాల్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్‌తో అఖిలేశ్
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన అఖిలేశ్ యాదవ్‌కు సీఎం రేవంత్ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అఖిలేశ్‌కు వివరించారు. అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
అఖిలేశ్ పర్యటన మర్మమేంటో ?
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్ విచ్చేసిన అఖిలేశ్ యాదవ్ తొలుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అఖిలేశ్ త్వరలో కేసీఆర్‌ను కూడా కలుస్తారని కేటీఆర్ వెల్లడించారు. అఖిలేశ్ ఈ రెండు చోట్లతోపాటు యాదవ ఆత్మీయ సమ్మేళనంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే, బీజేపీ వ్యతిరేక పార్టీలైన ఒకే రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను అఖిలేశ్ కలవడం వెనుక ఉన్న మర్మమేంటి ? అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉప్పు, నిప్పులా ఉండే రెండు పార్టీల నేతలను ఒకే రోజు కలవడానికి కారణాలపై విశ్లేషణలు చేస్తున్నాయి.