Share News

Ajay Devgn to Establish World Class Film City: ఫ్యూచర్‌ సిటీలో మరో ఫిల్మ్‌సిటీ!

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:34 AM

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు....

Ajay Devgn to Establish World Class Film City: ఫ్యూచర్‌ సిటీలో మరో ఫిల్మ్‌సిటీ!

  • ఏర్పాటుకు ముందుకొచ్చిన అజయ్‌ దేవ్‌గన్‌

  • ఇప్పటికే సల్మాన్‌ఖాన్‌కు అవకాశమిచ్చిన ప్రభుత్వం

  • వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్‌ సిద్ధం

  • రూ.3 వేల కోట్లతో మూడు స్టార్‌ హోటళ్లనునిర్మించనున్న ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌ అండ్‌ బీ హోల్డింగ్స్‌

  • తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌లో కుదరనున్న ఒప్పందాలు

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ సందర్భంగా ఫిల్మ్‌సిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంటారు. ఇప్పటికే, మరో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు కూడా ఇక్కడే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్‌ సిటీలో ఇది రెండో ఫిల్మ్‌ సిటీ. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమ్మిట్‌లోనే అజయ్‌ దేవ్‌గన్‌ ప్రపంచ స్థాయి ఫిల్మ్‌ సిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది. రిలయన్స్‌ గ్రూప్‌ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోందని ప్రభుత్వం తెలిపింది.

రిలయన్స్‌కు చెందిన వంతారా యానిమల్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌, వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేటరీ, నైట్‌ సఫారీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని వివరించింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ఫ్యూచర్‌ సిటీలో 15,000 ఎకరాలు అడవి కోసం కేటాయించినందున ఇక్కడ వంతారా ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్కడ సాధ్యం కాకపోతే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వంతారా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గుజరాత్‌లో ఏర్పాటు చేసిన వంతారా అభయారణ్యం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఇవికాక దేశవ్యాప్తంగా విలాసవంతమైన కేటరింగ్‌ సర్వీసు అందించే ‘ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌ అండ్‌ బీ హోల్డింగ్స్‌’ కంపెనీ రూ.3 వేల కోట్లతో ఫ్యూచర్‌ సిటీలో మూడు స్టార్‌ హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాలపై గ్లోబల్‌ సదస్సులోనే సంతకాలు జరగనున్నాయి.

Updated Date - Dec 02 , 2025 | 05:34 AM