Share News

ప్రతిభ కనబరిస్తే విమాన ప్రయాణం

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:32 AM

: నల్లగొండ జిల్లా నిడమనూరులోని కేజీబీవీ విద్యార్థినులకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రత్యేక ఆఫర్‌ ఇచ్చారు.

ప్రతిభ కనబరిస్తే విమాన ప్రయాణం
కేజీబీవీ బాలికలతో మాట్లాడుతున్న నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

కేజీబీవీ విద్యార్థినులకు కలెక్టర్‌ ప్రత్యేక ఆఫర్‌

నిడమనూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నిడమనూరులోని కేజీబీవీ విద్యార్థినులకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రత్యేక ఆఫర్‌ ఇచ్చారు. పాఠశాలలో టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ చూపి టాపర్లుగా నిలిస్తే విమానంలో వైజాగ్‌ టూర్‌కు పంపించనున్నట్లు తెలిపారు. 9, 10 తరగతుల విద్యార్థినులను డిసెంబరు నెలలో రామోజీ ఫిలింసిటీ టూర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి మండలకేంద్రంలోని కేజీబీవీని ఆమె తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను, మౌలిక వసతులు, వంట గది, స్టోర్‌ రూము, డ్రైనేజీ సిస్టమ్‌, భోజనం, కూరగాయలను పరిశీలించారు. పాఠశాల మొత్తం కలియతిరిగారు. బాలికలకు నాణ్యమైన భోజనంతో పాటు గుణాత్మకమైన విద్యనందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సబ్జెక్టులకు సంబం ధించిన పలు ప్రశ్నలు వేసి విద్యార్థినుల నుంచి సమాధానాలు రాబట్టారు. బాలికలతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీని చూశారా అని ప్రశ్నించగా లేదని విద్యార్థినులు చెప్పారు. డిసెంబరు నెలలో పాఠశాలలోని 9, 10 తరగతులకు చెందిన 80 మంది బాలికలకు రామోజీ ఫిలిం సిటీని చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, తహసీల్దార్‌ జంగాల కృష్ణయ్య, ఎంపీడీవో గుర్రం వెంకటేశం, ఎంఈవో లావూరి వెంకన్న, ఏఈ పీఆర్‌ సాయిప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:32 AM