Share News

Air Pollution: ప్రజారోగ్యానికి వాయు గండం!

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:22 AM

రాష్ట్రంలో దీపావళి టపాసులతో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్కరోజులోనే ప్రమాదకర స్థాయికి చేరింది....

Air Pollution: ప్రజారోగ్యానికి వాయు గండం!

  • దీపావళి రోజున కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. -హైదరాబాద్‌లో 386కు చేరిన ‘ఏక్యూఐ’

  • నాలుగేళ్లలో అక్టోబరులో ఇదే తొలిసారి

  • గాలిలో ధూళికణాల (పీఎం2.5) స్థాయి 37ఎంజీ నుంచి 69ఎంజీకి పెరుగుదల

  • గత ఏడాది కంటే తగ్గిన ధ్వని కాలుష్యం

  • ఉదయం 64.03, రాత్రి 60.68 డెసిబుల్స్‌

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దీపావళి టపాసులతో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్కరోజులోనే ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటికే హైదరాబాద్‌తో సహ తెలంగాణలోని ముఖ్య నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌- ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దీపావళినాడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 386 మార్కును దాటింది. కేవలం కొద్ది గంటల్లోనే ఆ స్థాయికి చేరింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏక్యూఐ 105 ఉండగా.. రాత్రి 9 గంటలకు 386కు పెరిగింది. హైదరాబాద్‌లో గత నాలుగేళ్లలో అక్టోబరు నెలలో వాయు కాలుష్య తీవ్రత ఈ స్థాయిలో లేదని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది అక్టోబరులో ఏక్యూఐ ఒక్కసారి కూడా 100 దాటలేదు. ఇదే నెలలో గత నాలుగేళ్లల్లో ఒక్కసారీ 150 దాటలేదు. కానీ ఈ ఏడాది ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతీ రోజూ భాగ్యనగరంలో ఏక్యూఐ 100-150కు మధ్య నమోదవుతూ వస్తోంది. దీపావళి రోజు ఏకంగా అత్యధికంగా స్థాయులో 386కు పెరగడం ఆందోళనకు గురిచేస్తోందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఏక్యూఐ.. 50లోపు ఉండాలి. ఈ సంఖ్య పెరిగిన కొద్దీ వివిధ క్యాటగిరీలుగా విభజించారు. 301 నుంచి 400 మధ్య ఉంటే పర్పుల్‌ అలెర్ట్‌ జారీ చేసి.. ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిగణిస్తారు. ఆరోగ్యవంతులకూ శ్వాసకోశ సమస్యలు రావచ్చు. గుండె జబ్బులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. దీపావళి రోజున హైదరాబాద్‌లో గాలిలో ధూళి కణాల స్థాయి (పీఎం 2.5) క్యూబిక్‌ మీటరుకు 69 మైక్రో గ్రాములకు పెరిగింది. ఇది సాధారణ రోజుల్లో 37 ఎంజీ ఉంటుంది. పీఎం10 కణాల స్థాయి సాధారణ రోజుల్లో 91 ఎంజీ ఉండగా, దీపావళినాడు 153 ఎంజీకి చేరింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఈ గణాంకాలను విడుదల చేసింది. అయితే గత ఏడాది దీపావళి రోజుతో పోలిస్తే ఈ ఏడాది పీఎం2.5 ధూళికణాల స్థాయి 15 ఎంజీ, పీఎం10 కణాల స్థాయి 31 ఎంజీ తక్కువగా నమోదైందని వెల్లడించింది.


అవగాహన పెరిగింది.. ద్వని కాలుష్యం తగ్గింది

ధ్వని కాలుష్యంపై హైదరాబాద్‌ వాసుల్లో అవగాహన పెరిగిందా అంటే.. ఔననే అంటోంది కాలుష్య నియంత్రణ మండలి. రెండేళ్లుగా దీపావళి రోజున ధ్వని కాలుష్యం ఉదయం వేళ కంటే, రాత్రి వేళ తక్కువగా నమోదు కావడమే నిదర్శనమని చెబుతోంది. టీజీపీసీబీ తాజా నివేదిక మేరకు 2024 దీపావళి రోజున నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఉదయం 68.89 డెసిబుల్స్‌ ఉండగా, రాత్రి వేళ 65.68గా నమోదైంది. ఈ ఏడాది దీపావళి నాడు ఉదయం 64.03కు తగ్గగా, రాత్రివేళ మరింత తగ్గి 60.68 నమోదైంది. దీనిపై జేఎన్‌టీయూ పర్యావరణ నిపుణులు స్పందిస్తూ.. హైదరాబాద్‌ ప్రజలు అధిక ధ్వనిని సృష్టించే బాణసంచా వైపు మొగ్గు చూపలేదన్నారు. గతంలో అర్ధరాత్రి దాటాక ఒంటిగంట వరకు బాణసంచా కాల్చేవారని, ఈ ఏడాది రాత్రి 11 గంటల్లోపే శబ్దాలు ఆగిపోయాయని వివరించారు.

Updated Date - Oct 22 , 2025 | 05:22 AM