Share News

Union Minister Kishan Reddy: 1300 కోట్లతో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణం

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:00 AM

హైదరాబాద్‌ శివారు బీబీనగర్‌లో రూ.1300 కోట్లతో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయడంతో...

Union Minister Kishan Reddy: 1300 కోట్లతో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణం

  • దేశవ్యాప్తంగా డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్‌రెడ్డి

  • మండలానికో కల్చరల్‌ భవనం: జూపల్లి

ఆదిలాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారు బీబీనగర్‌లో రూ.1300 కోట్లతో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటు పీజీ సీట్లను పెంచుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో రూ.23.75 కోట్ల నిధులతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ 50 పడకల ఆస్పత్రిని రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మంచిర్యాల టు నాగపూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ఆదిలాబాద్‌ టు ఆర్మూర్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి సర్వే కొనసాగుతోందన్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో సోయాబీన్‌ పంట దెబ్బతిన్నదని, ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి చివరి వరకు పత్తి పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉందని, అయినా పలు ఆస్పత్రులకు నిధులు కేటాయిస్తున్నామని జూపల్లి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో విద్య, వైద్యం కోసం ఎంతో చేయాల్సి ఉందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, పర్యాటకులు పెరుగుతారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో కల్చరల్‌ భవనాలను నిర్మిస్తామన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 04:00 AM