Digital Threats: సినీతారలకు ఏఐ విలన్!
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:28 AM
సినీతారలకు కృత్రిమ మేధ ఏఐ విలన్‌గా మారింది. ఇటీవలి వరకు సినిమాల్లో స్పెషల్ ఎఫెక్టుల కోసం వాడిన సాంకేతికత ఇప్పుడు డిజిటల్ మోసగాళ్ల చేతిలో...
కృత్రిమ మేధతో సెలబ్రిటీల రూపంలో విచ్చలవిడిగా కంటెంట్ తయారీ
యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్ దాకా రూపొందించి సోషల్ మీడియాలో పెడుతున్న వైనం
వైరల్ అవుతుండటంతో సెలబ్రిటీలకు తంటాలు
కోర్టులను ఆశ్రయిస్తున్న నటులు
ఢిల్లీ హైకోర్టులో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, కరణ్ జోహర్ పిటిషన్లు
ఈ తరహా కంటెంట్‌ను అడ్డుకోలేని యూట్యూబ్, సోషల్ మీడియా
అల్గారిథం లోపాల వల్లే: నిపుణులు
మాన్యువల్ రివ్యూతోనే పరిష్కారం: నల్లమోతు శ్రీధర్
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సినీతారలకు కృత్రిమ మేధ (ఏఐ) విలన్‌గా మారింది. ఇటీవలి వరకు సినిమాల్లో స్పెషల్ ఎఫెక్టుల కోసం వాడిన సాంకేతికత ఇప్పుడు డిజిటల్ మోసగాళ్ల చేతిలో కొత్త ఆయుధంగా మారింది. ఏఐ సాయంతో సినీ సెలబ్రిటీల రూపంలో తయారవుతున్న చిత్రాలు, వీడియోలు కలకలం రేపుతున్నాయి. సినీతారలు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా గ్యాంబ్లింగ్, మోసపూరిత యాప్‌ల యాడ్స్‌తోపాటు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సినీ నటి రష్మికను పోలినట్టుగా రూపొందిన ఒక డీప్‌ఫేక్ వీడియో కలకలం సృష్టించింది కూడా. అయితే సినిమాల్లో విలన్లను ఆటాడుకునే తారలు.. ఈ ఏఐ విలన్‌ను మాత్రం తట్టుకోలేకపోతున్నారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇలాంటి ఏఐ వీడియోలు, చిత్రాలతో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నటి ఐశ్వర్యారాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు వేశారు. కొన్ని సినిమా వెబ్‌సైట్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, కొన్ని డార్క్ వెబ్‌సైట్లలో తమ చిత్రాలను వాడుతూ అశ్లీల కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నారని.. బెట్టింగ్ యాప్స్‌లోనూ తమ ఏఐ ఆధారిత చిత్రాలు, వీడియోలు వాడుతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌ఫేక్స్, ఫేస్ మార్ఫింగ్ సాంకేతికతల ద్వారా తమ చిత్రాలను, వీడియోలను రూపొందించి, వాడకుండా నిషేధించాలని కోర్టును కోరారు. తన చిత్రాలను వాడుతూ ఉగ్రవాద సంస్థలతో ముడిపెడుతున్నారని, అశ్లీల వీడియోలు రూపొందించారని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ చిత్రాలతో కొందరు అశ్లీల వీడియోలను రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని.. తమకు కలిగిన పరువు నష్టానికి యూట్యూబ్, గూగుల్ కంపెనీలు రూ.4కోట్లు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కోర్టును కోరారు.
కోర్టు ఆదేశించినా ఆగేనా?
సినీ సెలబ్రిటీల ఫిర్యాదుతో సదరు వీడియోలను, కంటెంట్‌ను తొలగించాలని యూట్యూబ్, ఇతర సంస్థలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ హైకోర్టు ఆదేశించినా వాటిని అడ్డుకోవడం సాధ్యమేనా అన్న దానిపై సైబర్ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో అప్‌లోడ్ అవుతున్న నకిలీ కంటెంట్‌ను అడ్డుకునే అల్గారిఽథం ఆయా సంస్థల వద్ద లేదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. తప్పుడు, అశ్లీల కంటెంట్‌ను.. వీపీఎన్, ఆనియన్ రూటింగ్ వంటి సాంకేతితకల ద్వారా ఇతర దేశాల ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్ర్‌సల నుంచి అప్‌లోడ్ చేస్తున్నారని... వాటిని అడ్డుకోవడం కష్టమని అంటున్నారు. ఇక యూట్యూబ్‌లోని ఏదైనా వీడియోపై అభ్యంతరాలుంటే.. ఆ సంస్థను కోరితే తొలగిస్తుంది. కానీ వందలు, వేల సంఖ్యలో తప్పుడు వీడియోలు ఉన్నప్పుడు.. ఆటోమేటిగ్గా అడ్డుకునే అల్గారిథం (నియమాలతో కూడిన కోడ్) ఉండాలి. కానీ ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు.
మ్యాన్యువల్ రివ్యూ లేకపోవడమే సమస్య: న ల్లమోతు శ్రీధర్
ప్రముఖ తారలు, సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను రెండు విధాలుగా విశ్లేషించాల్సి ఉంటుందని సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్ చెప్పారు. వాస్తవానికి యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలన్నింటికీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉంటాయని తెలిపారు. అయితే ఇది అభ్యంతరకర కంటెంట్ గుర్తించేందుకే పరిమితమని.. సున్నితమైన అంశాలను యంత్ర మేధ విస్మరిస్తుందని వివరించారు. ఉదాహరణకు అశ్లీలానికి సంబంధించి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అల్గారిథం కొన్ని శరీరభాగాలపై ఫోకస్ చేస్తుందని.. ఆ భాగాలు తప్పించి మిగతా శరీరమంతా నగ్నంగా చూపించినా అడ్డుకోదని తెలిపారు. ఎవరైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా అదే యంత్ర మేధ మరోసారి వీడియోను పరిశీలించి, తమకేమీ తప్పు కనిపించడం లేదని పేర్కొంటుందని వివరించారు. ఇలాంటి సున్నితమైన అంశాల విషయానికి వచ్చినపుడు మ్యాన్యువల్ రివ్యూ జరిగితే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. కానీ యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటివి మ్యాన్యువల్ రివ్యూకు అనుమతించడం లేదని తెలిపారు. ఎవరైనా వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేలా, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న కంటెంట్‌ను యూట్యూబ్ అడ్డుకోగలదని చెప్పారు. అయితే ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేరగాళ్లు.. ఆ ఒక్క అంశాన్ని వదిలేసి, మిగతా కంటెంట్ తాము అనుకున్నట్టుగా రూపొందిస్తున్నారని వెల్లడించారు. దీనిని అడ్డుకోవాలంటే కేంద్రమే కఠిన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ అభిప్రాయపడ్డారు.
అన్ని రంగాలకూ ‘ఏఐ’ సమస్య!
ప్రముఖ తారలే కాదు రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందినవారూ కృత్రిమ మేధ కంటెంట్ సమస్యను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఎవరైనా తమ అనుమతి లేకుండా ఫోటోలను, కంటెంట్‌ను రూపొందిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినపుడు మాత్రమే తాము చర్యలు తీసుకోగలుగుతున్నామని చెప్పారు. ఇటీవల కొందరు సీఎం రేవంత్, ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా కొందరు ఏఐ చిత్రాలను రూపొందించారని, ఆ కుట్రను ఛేదించామని వెల్లడించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ఏఐ చిత్రాలతో సమస్య ఎదురైందని గుర్తు చేశారు.