AI Cameras Installed: చెత్త ట్రక్కులకు ఏఐ కెమెరాలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:11 AM
అమెరికాలోని డాలస్ నగరంలో చెత్త నిర్వహణ విధానాన్ని ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించనున్నారు.....
డాలస్‌లో వ్యర్థాల సేకరణలో వినూత్న పద్ధతి
గూగుల్ స్ట్రీట్ వ్యూ తరహాలో పనిచేసే కెమెరాలతో ఉల్లంఘనల గుర్తింపు
(డాలస్ నుంచి కిలారు గోకుల్ కృష్ణ)
అమెరికాలోని డాలస్ నగరంలో చెత్త నిర్వహణ విధానాన్ని ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించనున్నారు. చెత్తను తరలించే ట్రక్కులకు ఏఐ కెమెరాలను అమర్చనున్నారు. వచ్చే ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా చెత్త, వ్యర్థాలను తరలించే 100 ట్రక్కులకు ప్రత్యేక ఏఐ కెమెరాలను అమర్చనున్నారు. చెత్త పేరుకుపోవడం, నిర్మాణ వ్యర్థాలు, చట్టవిరుద్ధంగా పడేసిన వస్తువులు వంటి వాటిని ఆయా కెమెరాల ద్వారా కచ్చితత్వంతో గుర్తించనున్నారు. తద్వారా ఉల్లంఘనలను గుర్తించి, సత్వరమే సంబంధిత శాఖలకు నివేదికలు పంపేందుకు వెసులుబాటు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కెమెరాలు గూగుల్ స్ట్రీట్ వ్యూ టెక్నాలజీ తరహాలో పనిచేస్తాయని వారు తెలిపారు. బుధవారం జరిగిన సిటీ కౌన్సిల్ సమావేశంలో గోప్యత, డేటా నిల్వలపై చర్చించి, ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి మూడేళ్లకు రూ.22 కోట్లు వెచ్చించనున్నారు. ఏఐ సాయంతో నగర పరిశుభ్రతను మెరుగుపర్చడంలో డాలస్ అధికారులు తీసుకున్న ఈ చర్యలు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.