AI Based Citizen Services: కోటి మందికి ఏఐ ఆధారిత పౌరసేవలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:47 AM
ఏఐ ఆధారిత పౌర సేవలను 2027 నాటికి కోటి మంది ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
2027 నాటికి అందించాలన్నదే సర్కారు లక్ష్యం: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఏఐ ఆధారిత పౌర సేవలను 2027 నాటికి కోటి మంది ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు మూడు రోజుల ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమది సమస్య వచ్చిన తర్వాత స్పందించే ప్రభుత్వం కాదన్నారు. ప్రజలు అడగకుండానే ఏఐ సహకారంతో వారి ముంగిటకు పౌర సేవలను చేర్చి సరికొత్త తెలంగాణను నిర్మించాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. ఈ కొత్త తెలంగాణ 5 బిలియన్ డాలర్ల ఏఐ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. ‘ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్‌గా తెలంగాణ’ను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను అందుబాటులోకి తేబోతున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్‌చేంజ్‌ను ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో 20 ప్రభుత్వ శాఖలకు చెందిన 300 రకాల పౌర సేవలను ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాంపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఆయా శాఖల నుంచి 250 మంది అధికారులను ఎంపిక చేసి.. ఏఐ వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వీరికి 3 నెలల పాటు ఏఐ నిపుణులు మార్గదర్శనం కూడా చేస్తారని వివరించారు.