Share News

kumaram bheem asifabad- అరచేతిలో వ్యవసాయం

ABN , Publish Date - Aug 30 , 2025 | 10:59 PM

వ్యవసాయం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దాదాపు ప్రతిరైతు దగ్గర సెల్‌ఫోన్‌ ఉంటుంది. అరచేతిలో రైతులకు పరిజ్ఞాణం అందుబాటులోకి వచ్చింది. దీనికి తగినట్లుగానే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారిక వాట్సాప్‌ ఛానల్‌ను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది.

kumaram bheem asifabad- అరచేతిలో వ్యవసాయం
బెజ్జూరులో సాగు చేస్తున్న వరిపంట

- రైతులకు సమాచారం చేరవేత

- పంటల సంరక్షణ, సబ్సిడీలు తెలుసుకునే అవకాశం

బెజ్జూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దాదాపు ప్రతిరైతు దగ్గర సెల్‌ఫోన్‌ ఉంటుంది. అరచేతిలో రైతులకు పరిజ్ఞాణం అందుబాటులోకి వచ్చింది. దీనికి తగినట్లుగానే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారిక వాట్సాప్‌ ఛానల్‌ను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞాణాన్ని రైతులు అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన యాప్‌పై ఆసిఫాబాద్‌ జిల్లాలోని రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. ప్రతి వ్యవసాయ క్లస్టర్‌లో వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో) కనీసం 100మంది రైతుల సెల్‌ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి ఆదేశించారు.

ఫ రైతులకు లభించే సమాచారం ఇలా..

- ప్రభుత్వ పథకాలు, రాయితీ వివరాలు

- పంటల సంరక్షణ, కాలానుగుణ సూచనలు

- వాతావరణ హెచ్చరికలు, కీటక నియంత్రణ మార్గదర్శకాలు

- మార్కెట్‌ ధరలు, శిక్షణ కార్యక్రమాలు, తదితరాలు

రైతునేస్తం కార్యక్రమాల షెడ్యూల్‌, రాష్ట్రంలోని 1,600 రైతువేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్లలో నిర్వహించబోయే అంశాల సమాచారాన్ని ఈ వాట్సాప్‌ ఛానెల్‌ ద్వారా వ్యయసాయశాఖ చేరవేస్తోంది.

ఫ సకాలంలో సూచనలు, సలహాలు..

కాలానికి అనుగుణంగా పంటల దశలను బట్టి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందిపుచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాతావరణ శాఖ సలహాలు, సూచనలు సైతం అందుబాటులోకి తెస్తోంది. సమయానుకూలమైన, నమ్మకమైన, ఉపయోగకరమైన సమాచారం నేరుగా రైతుల చేతుల్లోకి చేరుతుంది. వ్యవసాయంలో ఉత్పాదకత, రైతు ఆధాయం పెంపు, స్థిరమైన వ్యవసాయం వైపు ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికా రులు చెబుతున్నారు.

రైతులు సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవాలి..

- నాగరాజు, వ్వవసాయ అధికారి, బెజ్జూరు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన అధికారిక వాట్సాప్‌ ఛానల్‌ను రైతులందరూ వినియోగించుకోవాలి. రైతులు తమ కార్యాలయంలో గానీ తమను నేరుగా కలిసి వాట్సాప్‌ ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవచ్చు. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందుతాయి. రైతులు వెంటనే ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవాలి.

Updated Date - Aug 30 , 2025 | 11:00 PM