Godrej Group President Rakesh Swami: వ్యవసాయం, ఆయిల్‌పామ్‌ల్లో అవకాశాలు పుష్కలం
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:58 AM
తమ సంస్థ తెలంగాణలో నిర్మాణ, వ్యవసాయం.. అనుబంధ రంగాల్లో రూ.450 కోట్ల పెట్టుబడులు పెడుతుందని గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్...
ఖమ్మంలో సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్సు ఏర్పాటు
హైదరాబాద్ శివారుల్లో డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్
గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్ స్వామి
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తమ సంస్థ తెలంగాణలో నిర్మాణ, వ్యవసాయం.. అనుబంధ రంగాల్లో రూ.450 కోట్ల పెట్టుబడులు పెడుతుందని గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు) రాకేశ్ స్వామి చెప్పారు. రాకేశ్ స్వామి ‘ఆంధ్రజ్యోతి’కిచ్చిన ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే.. ‘వ్యవసాయం, ఆయిల్ పామ్ రంగాల అభివృద్ధి అవకాశాలు పుష్కలం. ఇప్పటికే కోకాపేట, రాజేంద్రనగర్‌లలో భారీ ప్రాజెక్టులు చేపట్టాం. ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్లతో వచ్చే ఏడాది మేం ఏర్పాటు చేసే సమీకృత ఆయిల్ పామ్ కాంపెక్స్‌తో ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా 300 మందికి ఉపాధి లభిస్తుంది. రూ.150 కోట్ల అంచనాతో 40 ఎకరాల్లో హైదరాబాద్ శివార్లలో డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో మంగళవారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ వ్యూహాత్మక ప్రాంతం. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం అద్భుతం. సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్. సింగిల్ విండో క్లియరెన్సులు, అన్ని పరిశ్రమలకు ఓపెన్ డోర్ పాలసీ ప్రకటించిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు. రాష్ట్ర పురోభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ కీలకమవుతుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక నిపుణులు, పర్యావరణ అనుకూల పరిస్థితులు, పటిష్ఠమైన ఐటీ వ్యవస్థ వంటి సానుకూలతలు హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధికి దోహద పడతాయి. మేం చేపట్టే ప్రతి కార్యక్రమం పర్యావరణ హితం. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై రైతులు, గ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ మహిళల్లో చైతన్యం తేవడానికి వచ్చే ఏడాది వివిధ కార్యక్రమాలు అమలు చేయనున్నాం. పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు సర్కారుకు సహకరించబోతున్నాం. విద్యారంగంలో నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి, మా ప్రాధాన్యాలు’ అని తెలిపారు.