Share News

Commission Scam: కమీషన్లకు ఆశపడి కోట్లు వసూలు చేసిన ఏజెంట్‌ మృతి

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:49 AM

కమీషన్లు, నజరానాలకు ఆశపడి ఓ వ్యాపారికి ఏజెంట్‌గా మారి రూ.కోట్లలో డబ్బు వసూళ్లు చేసి మోసపోయి ఆత్మహత్యాయత్నం చేసిన నల్లగొండ జిల్లా...

Commission Scam: కమీషన్లకు ఆశపడి కోట్లు వసూలు చేసిన ఏజెంట్‌ మృతి

పెద్దఅడిశర్లపల్లి/నేరేడుచర్ల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కమీషన్లు, నజరానాలకు ఆశపడి ఓ వ్యాపారికి ఏజెంట్‌గా మారి రూ.కోట్లలో డబ్బు వసూళ్లు చేసి మోసపోయి ఆత్మహత్యాయత్నం చేసిన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్‌ సరియానాయక్‌ (37) చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. పలుగుతండాకే చెందిన రమావత్‌ బాలాజీనాయక్‌ అధిక వడ్డీ ఆశ చూపి ఏజెంట్ల సాయంతో ప్రజల నుంచి రూ.కోట్లలో డబ్బు వసూలు చేశాడు. తనకు డబ్బు ఇచ్చిన వారికి బాలాజీ నాయక్‌ 10 శాతం వడ్డీ ఇచ్చేవాడు. నగదు సేకరణకు ఏజెంట్లుగా వ్యవహరించిన వారికి 6 శాతం కమీషన్‌ ఇచ్చేవాడు. ఇదే కాక, రూ.కోటీకి పైగా పెట్టుబడులు తెచ్చిన ఏజెంట్లకు రూ.లక్షల విలువైన బైక్‌, రూ.2కోట్లకు పైగా తెచ్చిన ఏజెంట్లకు కారు నజరానాలు ప్రకటించాడు. బాలాజీ బంధువు కావడంతోపాటు అతడు ప్రకటించిన కమీషన్లు, నజరానాలకు ఆశపడి సరియానాయక్‌ తనకు తెలిసిన వాళ్ల నుంచి రూ.కోటి దాకా వసూలు చేసి ఇచ్చాడు. తొలుత వడ్డీలు సక్రమంగా ఇచ్చిన బాలాజీనాయక్‌ మూడు నెలలుగా వడ్డీలు ఇవ్వకపోగా 15 రోజులుగా అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన సరియా నాయక్‌ నాలుగు రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. సరియానాయక్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరియానాయక్‌ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసి అతని బంధువులు, గ్రామ ప్రజలు కొందరు బాలాజీనాయక్‌ ఇంటిపై మంగళవారం దాడి చేసి వస్తువులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇక, సరియానాయక్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తున్నారనే సమాచారంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో బాలాజీనాయక్‌ తన సోదరి పేరుతో ఇళ్లు కొనుగోలు చేశాడన్న సమాచారంతో బాధితులు కొందరు సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని బాలాజీ నాయక్‌ సోదరి ఇంటిపై దాడి చేసేందుకు బుధవారం యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 05:49 AM