Maoist Sunil to Return Home: 27 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:19 AM
చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన 15-16 ఏళ్ల వయస్సులో ఇంటినుంచి వెళ్లిన కన్న కొడుకు కాన రాలేదు. ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయినప్పుడైనా వస్తాడనుకున్న....
1988లో మావోయిస్టుల్లో చేరిన పోలెపాక సునీల్
ఇటీవలే లొంగుబాటు.. త్వరలోనే ఇంటికి.. పోలీసుల తీపి కబురు
ఆనందంతో తల్లి సులోచన కన్నీటి పర్యంతం
ఖిలా వరంగల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన 15-16 ఏళ్ల వయస్సులో ఇంటినుంచి వెళ్లిన కన్న కొడుకు కాన రాలేదు. ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయినప్పుడైనా వస్తాడనుకున్న ఆ తల్లి ఆశలు వదిలేసుకున్నారు. కన్నవారూ, మనుమలు, ముని మనుమల పలకరింపులతో జీవనం సాగించే ముదిమి వయస్సులో ఉన్న ఆ కన్నతల్లి.. తన కొడుకు ఇంటికి వస్తున్నాడన్న వార్త తెలిసి భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైన కన్నీటి పర్యంతమయ్యారు.
ఆమె పేరు పోలెపాక సులోచన (80). ఆమె కొడుకు పేరు పోలెపాక సునీల్. ‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకుని పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టుల్లో ఆయన ఒకరు. 27 ఏళ్ల క్రితం ఇంటర్‌లో చేరిన 1988లో ఒకరోజు కాలేజీకెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అతడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, సోదరులు.. బంధువులు, స్నేహితులు, తెలిసిన చోటల్లా వెదికారు కానీ ఫలితం లభించలేదు. తర్వాత కొన్ని రోజులకు ఇంటికొచ్చిన పోలీసులు ‘మీ కొడుకు మావోయిస్టుల్లో కలిశాడు’ అని చెప్పి, సోదాలు చేసి వెళ్లారు. తర్వాత కూడా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి ‘మీ కొడుకు వచ్చాడా..?, ఎప్పుడు వచ్చాడు’ అని చెప్పి తనిఖీలు చేసి వెళ్లిపోయే వారని సునీల్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు చెప్పేవారు.
ఇదంతా గతం.. ఇప్పుడు వారం క్రితం హైదరాబాద్ పోలీసుల నుంచి సునీల్ తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. వరంగల్ పోలీసులూ ఇంటికొచ్చారు. అటు హైదరాబాద్, ఇటు వరంగల్ పోలీసులు చెప్పింది ఒక్కటే మాట.. ‘ఛత్తీ్‌సగఢ్‌లో మీ కొడుకు పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. త్వరలో ఇంటికొస్తాడు’ అని చెప్పారు. ఛత్తీ్‌సగఢ్‌లోని బల్లార్‌పూర్ ప్రాంత దళ కమాండర్‌గా ఉన్న సునీల్ ఈ నెల 6న పోలీసులకు లొంగిపోయాడని పోలీసులు చెప్పారు. ఈ వార్త సులోచన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతడి సోదరులు సైతం సునీల్ రాక కోసం వేయి కన్నులతో వేచి చూస్తున్నారు. క్రిస్టియన్ కాలనీలోని అతడి స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..
Dog attack on Boy: బాలుడిపై శునకం దాడి.. తెగిపడిన చెవి