Afcons Denies: మళ్లీ చెబుతున్నాం... మీ వాదనలతో విభేదిస్తున్నాం
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:21 AM
అన్నారం బ్యారేజీలో సమస్యలకు మేం కారణం కాదు. ప్రభుత్వం అందించిన డిజైన్ల ప్రకారమే నిర్మించాం.
మళ్లీ చెబుతున్నాం... మీ వాదనలతో విభేదిస్తున్నాం అన్నారం బ్యారేజీలో లోపాలకు కారణం మేం కాదు
సర్కారు డిజైన్ల మేరకే నిర్మించాం
అయినప్పటికీ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం
వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ లేఖ
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘అన్నారం బ్యారేజీలో సమస్యలకు మేం కారణం కాదు. ప్రభుత్వం అందించిన డిజైన్ల ప్రకారమే నిర్మించాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం... జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ అధ్యయనంపై గత జూన్ 27న రాసిన లేఖలో మా అభిప్రాయం చెప్పాం.. అయినప్పటికీ మళ్లీ సమగ్రంగా లేఖ రాస్తాం’ అని నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ సర్కారుకు శనివారం స్పష్టంచేసింది. బ్యారేజీ నిర్మాణ లోపాలను తెలుపుతూ మరమ్మతులు చేయాల్సిన బాధ్యతను వివరిస్తూ ఈనెల 10వ తేదీన నీటిపారుదలశాఖ రాసిన లేఖలోని అంశాలతో పూర్తిగా విభేదిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
నీటిపారుదలశాఖ వాదన ఇదీ..
2019 వరదలకు బ్యారేజీ దిగువ భాగంలో సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాయని, 2020 వరదలకు వేరింగ్ కోట్ ధ్వంసమైందని నీటిపారుదలశాఖ పేర్కొంది. 2020 ఏప్రిల్‌లో గేట్ నం.35,44., 2021 జనవరిలో గేట్‌నం.38,28., 2024లో గేట్‌నం.35ల కిందినుంచి సీపేజీలు బయటపడ్డాయని తెలిపింది. ఇవన్నీ డిఫెక్ట్ లయబిల్టీ కాలంలోనే (బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటినుంచి రెండేళ్లలోపు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత నిర్మాణ సంస్థది) వచ్చినందున డీఎల్‌ఎఫ్ డీమ్డ్ ఎక్స్‌టెండెడ్‌గా(దానికదే పొడిగించినట్లు) పరిగణనలోకి తీసుకొని అన్నారం బ్యారేజీకి మరమ్మతులు చేయాలని నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌కు గుర్తుచేస్తూ రామగుండం సర్కిల్ ఎస్‌ఈ ఈనెల 10వ తేదీన లేఖ రాసిన విషయం విదితమే.
సర్కారు ఆరోపణలను తిరస్కరించిన అఫ్కాన్స్
ప్రభుత్వ అధికారులు లేవనెత్తిన వాదనలతో విభేదిస్తున్నామని అఫ్కాన్స్-విజేత-పీఈఎ్‌స జాయింట్ వెంచర్ ప్రతినిధి, అన్నారం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి కె.ఎన్.మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఆయన రామగుండం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎ్‌సఈ)కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లు 2019 డిసెంబరు 20న కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్-2 ఇరిగేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) సర్టిఫికెట్ జారీ చేశారని, 2021 డిసెంబరులోనే డిఫెక్ట్ లయబిల్టీ కాలం పూర్తయిందని లేఖలో పేర్కొన్నారు. దీంతో బ్యారేజీలో తమ బాధ్యతలు పూర్తయ్యాయని, కొత్తగా ప్రభుత్వం ప్రతిపాదించే పనులన్నీ అదనపు పనులుగానే పరిగణనలోకి తీసుకుంటామని, కాంట్రాక్ట్ ఒప్పందంలోని నిబంధనలకు లోబడి వీటిని చేస్తామన్నారు. ఇప్పటిదాకా తమ మధ్య 81 ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదికపై జూన్ 27న లేఖనం.3153లో వివరణ ఇచ్చామన్నారు. అన్నారం పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని, బ్యారేజీని కాపాడుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందన్నారు. బ్యారేజీలో కేంద్ర నీటి,విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పుణె) చేసే అన్ని పరీక్షలకు యంత్రాలు, సిబ్బందిని సమకూర్చాలని రాసిన లేఖపై గత అక్టోబరు 17నప్రత్యుత్తరమిచ్చినట్లు పేర్కొన్నారు. మే 19వ తేదీ నాటి సమావేశంలో అంగీకరించిన విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.176.49 కోట్లను సత్వరం చెల్లించాలని కోరారు