kumaram bheem asifabad- నానో ఎరువులతో ప్రయోజనాలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:50 PM
వ్యవసాయాన్ని సులభతరంగా, లాభసాటిగా మార్చడానికి నూతన ఆవిష్కరణలు ఊతమిస్తున్నాయి. ఈ కోవలో రూపుదిద్దుకొన్న నానో సాంకేతికత ఎరువుల తయారీలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. యూరియా, డీఏపీలు ‘నానో ఎరువులు’గా ద్రవరూపంలో అందుబాటులోకి వచ్చాయి. పంటల సాగులో ఎరువుల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
- రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
బెజ్జూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని సులభతరంగా, లాభసాటిగా మార్చడానికి నూతన ఆవిష్కరణలు ఊతమిస్తున్నాయి. ఈ కోవలో రూపుదిద్దుకొన్న నానో సాంకేతికత ఎరువుల తయారీలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. యూరియా, డీఏపీలు ‘నానో ఎరువులు’గా ద్రవరూపంలో అందుబాటులోకి వచ్చాయి. పంటల సాగులో ఎరువుల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూసార దెబ్బతినకుండా వాతావరణ కాలుష్యం లేకుండా ఉండేందుకు సమగ్ర కార్యాచరణ చేపడుతోంది. చిన్న గుళికల రూపంలో ఉండే యూరియా స్థానంలో ద్రవరూపం నానో యూరియాను అందుబాటులో తెచ్చింది. డీఏపీ కూడా ఇలాగే లభిస్తోంది. దశాబ్దాలుగా సంప్రదాయ పద్ధతిలోనే బస్తాలకొద్ది ఉపయోగించిన రైతన్నలు నానో యూరియాపై ఆసక్తి కనబర్చడం లేదని వ్యవసాయాధికారుల సర్వేలో తేలింది. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులతో రైతు వేదికల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
స్పటిక రూపంలో..
స్పటిక రూపంలో ఎరువులతో వృధా ఎక్కువ అవుతుంది. మార్కెట్‌లో 45 కిలోల బస్తా రూ.270 ఉంది. దానికి సమానమైన నానో యూరియా అర లీటరు డబ్బా ధర రూ.225 మాత్రమే. మొక్కలకు పిచికారి చేయడంతో ఎక్కువ ఫలితం ఉంటుందని అదికారులు చెబుతున్నారు. పంట కాలానికి ముందుగానే రైతు భరోసా నిదులు జమ చేయడంతో రైతులు ఉత్సాహంగా సాగుబడి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎకరాలు కాగా ఇందులో వరి 50 వేలు, పత్తి 3.40 లక్షలు, మిగిలిన పంటలను 18 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. నెలాఖరు వరకు పత్తి పంట సాగు మొత్తం పూర్తికానుంది వరి 40 శాతమే పూర్తి చేశారు. బోరు బావుల వద్ద సాగు ఊపందుకోగా కాలువల వద్ద వరి నాటు వేసే దశకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
- నాగరాజు, వ్యవసాయాధికారి, బెజ్జూరు
గుళికల రూపంలో కాకుండా ద్రవరూపంలో ఉండే అత్యాధునిక నానో యూరియా, డీఏపీ ఎరువులను ఉపయోగించడం వల్ల రైతులు లాభసాటి వ్యవసాయం చేసుకోవచ్చు. వీటి వినియోగంతో పోషకాల వినియోగ సామర్థ్యంతో పాటు పంటోత్పత్తుల దిగుబడి పెరుగుతుంది. పర్యావరణానికి సురక్షితమైంది.