Adluri and Ponnam Resolve Dispute: అడ్లూరికి పొన్నం క్షమాపణలు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:29 AM
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ల మధ్య వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం..
ఆయన్ను ఉద్దేశించి తానేమీ అనలేదని వెల్లడి
టీపీసీసీ చీఫ్ చొరవతో సద్దుమణిగిన వివాదం
సమస్య ఇంతటితో ముగిసిపోయింది: అడ్లూరి
మంత్రులు బాధ్యతగా మాట్లాడాలి: మహేశ్
హైదరాబాద్/కరీంనగర్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ల మధ్య వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చొరవతో టీ కప్పులో తుపానులా తేలిపోయింది. మహేశ్‌గౌడ్ నివాసంలో అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది. మంగళవారం మంత్రులిద్దరితో మాట్లాడిన మహేశ్‌గౌడ్.. బుధవారం తన నివాసానికి రావాలని ఇద్దరికీ సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులిద్దరూ ఉదయం మహేశ్‌గౌడ్ ఇంటికి వెళ్లారు. ఆయన సమక్షంలో పొన్నం, అడ్లూరి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్‌ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పార్టీ నేతలు ఈరవత్రి అనిల్, శివసేనారెడ్డి, వినయ్‌కుమార్‌లూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా మంత్రి అడ్లూరిని ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదన్నారు. కానీ, జరిగిన ప్రచారానికి ఆయన బాధపడ్డారని చెప్పారు. ఇందుకుగాను వ్యక్తిగతంగా అడ్లూరి లక్ష్మణ్‌కు తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి పార్టీలో పుట్టి పెరిగిన తనకు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లకు పార్టీ సంక్షేమం తప్ప ఎలాంటి దురుద్దేశాలూ లేవని చెప్పారు. తామంతా ఐక్యంగా సామాజిక న్యాయ సాధన లక్ష్యం కోసం పని చేస్తామన్నారు. తాను కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గం వారితో కలిసి పెరిగిన వాడినని తెలిపారు. ఇకపై ఎలాంటి అపోహలకు తావుండొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, టీపీసీసీ చీఫ్ సమక్షంలో భేటీకి ముందే జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
సమస్య ఇంతటితో ముగిసింది: అడ్లూరి
పొన్నం ప్రభాకర్ క్షమాపణలు కోరడంతో సమస్య ముగిసిపోయిందని అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, జెండా మోసిన తనకు మంత్రిగా అవకాశమూ ఇచ్చిందని అన్నారు. తాను పార్టీ గీత దాటే వ్యక్తిని కాదని చెప్పారు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తానని, కానీ ఆయన వ్యాఖ్యల పట్ల తన మాదిగ జాతి బాధపడిందని తెలిపారు. ఆయన క్షమాపణలు చెప్పడంతో సమస్య సమసిపోయిందన్నారు.
మంత్రులు బాధ్యతగా మాట్లాడాలి: మహేశ్‌గౌడ్
మంత్రులు మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ల మధ్య జరిగిన సంఘటన.. తమ కుటుంబ సమస్య అని చెప్పారు. ఈ ఘటన పట్ల చింతిస్తూ అడ్లూరికి పొన్నం క్షమాపణలు చెప్పారన్నారు. ఈ సమస్యను ఇంతటితో ముగించాలని మాదిగ సామాజిక వర్గ నేతలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు కష్టపడి పైకి వచ్చిన నేతలని గుర్తుచేశారు. కాగా, 24 గంటల్లో పొన్నం క్షమాపణలు చెప్పాలంటూ లక్ష్మణ్ సామాజికవర్గం వారు డిమాండ్ చేయడమేగాక ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడంతో బుధవారం కరీంనగర్‌లో ఉద్రిక్తత కొనసాగింది. కరీంనగర్‌లోని మంత్రి పొన్నం ఇంటి వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.