Adivasi Rally In Bhadrachalam: ఎస్టీల నుంచి లంబాడాలను తొలగించాల్సిందే
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:23 AM
నిబంధనలకు విరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన లాంబాడీలను తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు..
ధర్మయుద్ధం సభలో ఆదివాసీ నేతల డిమాండ్
సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తా: పొదెం
భద్రాచలం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన లాంబాడీలను తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గాంధేయ మార్గంలో 9 తెగల ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలని, తమ పోరాటానికి అన్ని పార్టీలూ సహకరించాల్సిన సమయం ఆసన్నమైందని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగిన ‘ధర్మయుద్ధం’ సభలో పాల్గొన్న నేతలు చెప్పారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీల ధర్మపోరాటానికి కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుందన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన సోయం బాపురావు.. ‘సీతారాం నాయక్ గారూ.. మీరు సీఎం, ప్రధానిని భయపెట్టొచ్చు. కానీ సోయం బాపురావును భయపెట్టలేరు. ఆదివాసీల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఖబడ్దార్’ అని హెచ్చరించారు. ఛత్తీ్‌సగఢ్ ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్ల జారీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తామన్నారు. డిసెంబర్ 9న 6లక్షల మందితో హైదరాబాద్‌లో బహిరంగసభలో తమ సత్తా చాటుతామని చెప్పారు.