Share News

Cold Wave Grips Telangana: వణికిస్తున్న చలిపులి

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:55 AM

శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. వారం రోజులుగా అనేక చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి....

Cold Wave Grips Telangana: వణికిస్తున్న చలిపులి

  • ఆదిలాబాద్‌ జిల్లా లోకారిలో అత్యల్పంగా 10.4 డిగ్రీలు నమోదు

  • ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, నవంబరు 10 : శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. వారం రోజులుగా అనేక చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా చలి ప్రభావం చూపిస్తోంది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29 సెల్సియస్‌ డిగ్రీలుగా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 12 సెల్సియస్‌ డిగ్రీలుగా నమోదయ్యింది. అత్యల్పంగా గాదిగూడ మండలం లోకారి(కె)లో 10.4 డిగ్రీలు, బోథ్‌ మండలం పొచ్చెరలో 10.8, నేరడిగొండలో 11, బజార్‌హత్నూర్‌లో 11.5, భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 11.6, గుడిహత్నూర్‌లో 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రజలు చలి తీవ్రతతో వణికి పోతున్నారు. సాయంత్రం, ఉదయం వేళల్లో చలి మంటలు వేసుకుంటూ వెచ్చదనాన్ని పొందుతున్నారు. ఈ నెల 19 వరకు జిల్లాపై శీతల గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి, ఉదయం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని పేర్కొంటున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. మూడు రోజులుగా జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం తిర్యాణి మండలంలో 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం శీతల గాలులతో పాటు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని గ్రామాలు చలి తీవ్రతకు గజగజలాడుతున్నాయి. సాయంత్రం అయిదు గంటల నుంచి చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 19 వరకు జిల్లాలో 9 నుంచి 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌ జల్లా హవేలీఘనపురంలో 12.3 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని నర్సాపూర్‌లో 12.8 డిగ్రీలు, అల్లాదుర్గంలో 12.9 డిగ్రీలు, కౌడిపల్లిలో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్‌లో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Nov 11 , 2025 | 02:55 AM