Share News

Heavy Rain Forecast: చలి గుప్పిట్లో ఆదిలాబాద్‌, కుమరం భీం జిల్లాలు

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:42 AM

అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌ను చలి చుట్టుముట్టేసింది. గత రెండు రోజులుగా వాతావరణంలో బాగా మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి....

Heavy Rain Forecast: చలి గుప్పిట్లో ఆదిలాబాద్‌, కుమరం భీం జిల్లాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌ను చలి చుట్టుముట్టేసింది. గత రెండు రోజులుగా వాతావరణంలో బాగా మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. చల్లటి ఈదురు గాలులతో ఉదయం 9 గంటల వరకు బయటకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. సాయంత్రం 5 గంటలకే జనం ఇళ్లలోకి వెళ్లిపోతున్నారు. 7 గంటల ప్రాంతంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, రోజు వారి కూలీలు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు నమోదు కాగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ శీతాకాల సీజన్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.2కు పడిపోవడం ఇదే మొదటిసారి. భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 10.3, బోథ్‌ పొచ్చెరలో 10.4, తలమడుగులో 11.2, తాంసిలో 11.4, గుడిహత్నూర్‌లో 12.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో చలి మరింతగా వణికిస్తోంది. సిర్పూర్‌(యు) మండలంలో ఆదివారం 9.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాణిలో 10.8, కెరమెరిలో 11.4, వాంకిడిలో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌ నగరంలోనూ ఆదివారం చలి గాలుల తీవ్రత పెరిగింది. శనివారం రాత్రి శేరిలింగంపల్లిలో 14.1, రామచంద్రాపురంలో 14.4, రాజేంద్రనగర్‌లో 14.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు రోజులుగా నగరంలో చలి తీవ్రత పెరుగుతోంది.

నేడు 4 జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడ్డ దిత్వా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ నాలుగు జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు కురిసే అవకా శం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Dec 01 , 2025 | 05:42 AM