Komatireddy Venkat Reddy: 1000 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:42 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన విమానాశ్రయాన్ని 1,000 ఎకరాల్లో నిర్మించనుంది. ప్రస్తుతం అక్కడున్న ఏరోడ్రోమ్ పరిధిలోని సుమారు..
ఉన్న 300 ఎకరాలకు అదనంగా 700 ఎకరాల సేకరణ
భూ సేకరణకు కలెక్టర్‌కు ఆదేశాలు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో ముందడుగు : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన విమానాశ్రయాన్ని 1,000 ఎకరాల్లో నిర్మించనుంది. ప్రస్తుతం అక్కడున్న ఏరోడ్రోమ్ పరిధిలోని సుమారు 300 ఎకరాల భూమికి అదనంగా మరో 700 ఎకరాలను సేకరించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని సేకరించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సానుకూల నివేదిక ఇచ్చిన నేపథ్య ంలో ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియపై దృష్టిసారించింది. ఇక ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణంతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వాణిజ్య ం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో ఇది కీలక అడుగు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తుందని తెలిపారు. కాగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో భారత వాయుసేనతో పాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. అటు ఎయిర్‌ఫోర్స్, ఇటు ప్రయాణికుల విమానాల రాకపోకలకు జాయుంట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించనున్నారు. ఎయిర్‌ఫోర్స్, ప్రయాణికుల విమానాలు వేర్వేరు టెర్మినళ్ల వైపు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం ట్యాక్సీబేస్, లింక్డ్‌బేస్ విధానంలో రన్‌వేను నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎయిర్‌బస్-320 విమానాలు వచ్చేలా నిర్మించనున్నారు. పగలు-రాత్రి (డే అండ్ నైట్) విమానాలు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సివిల్ ఏవియేషన్ విభాగంతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు మార్గంసుగమం కాగా.. తాజాగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ఏవియేషన్ కార్పొరేషన్‌కు జేఎండీ నియామకం
తెలంగాణ ఏవియేషన్ కార్పొరేషన్(టీఎ్‌సఏసీఎల్)కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రోహిత్ గౌడ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నెల ముందు నోటీసు ఇచ్చి ఈ పదవికి సంబంధించిన కాంట్రాక్టును ఉపసంహరించుకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆయన పదవిలో ఉన్నంత కాలం పూర్తి జీతభత్యాలు, అలవెన్సులు, అధికార సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రోహిత్ గౌడ్ 18.08.2025 తేదీ నుంచే ఈ పదవిలో విధులు చేపట్టినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.