Share News

Additional Collector Venkatreddy: 60 వేలు లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్‌ అరెస్టు

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:26 AM

ఓ ప్రైవేటు పాఠశాల పునరుద్ధరణ ఆదేశాలివ్వడానికి రూ.లక్ష లంచం డిమాండ్‌ చేసిన హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌...

Additional Collector Venkatreddy: 60 వేలు లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్‌ అరెస్టు

  • హనుమకొండ జిల్లాలో ఘటన

  • స్కూల్‌ పునరుద్ధరణకు లక్ష డిమాండ్‌ చేసిన అధికారి

  • 60 వేలకు ఒప్పందం.. ఏసీబీ దాడిలో అరెస్టు

  • ఆయనతో పాటు ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు కూడా

వరంగల్‌ క్రైం/ హనుమకొండ కలెక్టరేట్‌/ చండూరు/ బెల్లంపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు పాఠశాల పునరుద్ధరణ ఆదేశాలివ్వడానికి రూ.లక్ష లంచం డిమాండ్‌ చేసిన హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌ (ఇన్‌చార్జి డీఈఓ) వెంకట్‌రెడ్డి, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు మనోజ్‌, గౌస్‌లను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని కొత్తూరు జెండా ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాల క్రియేటివ్‌ పాఠశాల రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసిన కరస్పాండెంట్‌ పాశికంటి సతీశ్‌ కుమార్‌ను తన ఇద్దరు జూనియర్‌ అసిసెంట్ల ద్వారా అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి రూ. లక్ష లంచం డిమాండ్‌ చేశారు. దీంతో రూ.60 వేలు చెల్లించడానికి మనోజ్‌, గౌస్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న పాశికంటి సతీశ్‌ కుమార్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు శుక్రవారం సాయంత్రం డబ్బులివ్వడానికి డీఈఓ కార్యాలయానికి వెళ్లిన సతీశ్‌ కుమార్‌ను జూనియర్‌ అసిస్టెంట్లు కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతడి వద్ద రూ.60 వేల నగదు తీసుకుని అదనపు కలెక్టర్‌ చాంబర్‌లోకి వెళ్లారు. వారి వెంటే చాంబర్‌లోకి వెళ్లిన ఏసీబీ అధికారులు.. అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్లు మనోజ్‌, గౌస్‌లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వీరితోపాటు మరో ఇద్దరు ప్రభుత్వోద్యోగులను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం కింద తేరట్‌పల్లి గ్రామంలో భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ వివరాల కోసం పిటిషన్‌ దాఖలు చేసిన రైతును నల్లగొండ జిల్లా ఉమ్మడి చండూరు (గట్టుప్పల్‌) ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ రూ.20 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సదరు రైతు.. వారి సూచన మేరకు గురువారం రాత్రి హైదరాబాద్‌లోని చంద్రశేఖర్‌ నివాసంలో సదరు రైతు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా చంద్రశేఖర్‌ను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుడికి మొదటి విడుత రూ.లక్ష బిల్లు మంజూరు చేయడానికి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్‌కుమార్‌ రూ.10 వేలు లంచం అడిగాడు. తానంత ఇచ్చుకోలేనని రూ.5,000లకు బేరం కుదుర్చుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బెల్లంపల్లి పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బాధితుడు శుక్రవారం రాత్రి రూ.5,000 నగదు ఇస్తుండగా కార్యదర్శి రాజ్‌కుమార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 06 , 2025 | 05:26 AM