kumaram bheem asifabad- ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:25 PM
రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలో గల రాయల్ ఫర్టిలైజర్ దుకాణాన్ని బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు.
వాంకిడి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలో గల రాయల్ ఫర్టిలైజర్ దుకాణాన్ని బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాకు రిజిస్టర్, నిల్వలను పరిశీలించారు. జిల్లాలో రైతుల వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. దుకాణంలో ధరల పట్టిక, స్టాకు నిలువల పట్టికను షాపు ముందు ప్రదర్శిం చాలని చెప్పారు. యూరియా, డీఏపీ, ఇతర మందులను అధిక ధరలకు విక్రయించినట్లుగా ఫిర్యాదు అందితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని ప్రతీ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేయాలన్నారు. స్టాకు, నిల్వల వివరాలను ప్రతి రోజు సమర్పించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున మొక్కలు నాటేందుకు అనువైన వాతావరణం ఉందన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జాబిరే పెంటు, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో ఖాజా అజీజోద్దిన్, వ్యవసాయ అధికారి గోపికాంత్, గిర్దావార్ మాజీద్, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.