కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి : సీపీఎం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:38 AM
డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో వర్షాలకు కుంగిందని, అందుకు కారణమైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి : సీపీఎం
నల్లగొండరూరల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో వర్షాలకు కుంగిందని, అందుకు కారణమైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను, కుంగిపోయిన సెప్టిక్ ట్యాంక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లాటరీ ద్వారా నల్లగొండ పట్టణంలో 552 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో చేసిన ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్, వాటర్ ట్యాంకు తదతర పనులు చేపట్టినట్లు తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు. దీంతో పట్టణంలో కురిసిన వర్షాలకు సెప్టిక్ ట్యాంక్ కుంగిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అవుట రవీందర్, తుమ్మల పద్మ, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.