Record Land Auction in Kokapet: కోకాపేటలో కోట్లవర్షం!
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:50 AM
భూముల వేలంతో కోకాపేట కోట్లపేటగా మారింది. మూడేళ్ల క్రితం ఇక్కడ ఎకరం ధర రూ.100 కోట్లు పలుకగా.. మూడు రోజుల క్రితం ఎకరం రూ.135 కోట్లు పలికింది....
అత్యధికంగా ఎకరం ధర 151.25 కోట్లు
పోటీపడిన డెవలపర్లు
పది గంటల పాటు సాగిన వేలం
రెండు ప్లాట్ల విక్రయంతో హెచ్‌ఎండీఏకు రూ. 1,353 కోట్ల ఆదాయం
హైదరాబాద్ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : భూముల వేలంతో కోకాపేట కోట్లపేటగా మారింది. మూడేళ్ల క్రితం ఇక్కడ ఎకరం ధర రూ.100 కోట్లు పలుకగా.. మూడు రోజుల క్రితం ఎకరం రూ.135 కోట్లు పలికింది. తాజాగా ఎకరం రూ.151.25 కోట్లు పలకడం విశేషం. శుక్రవారం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేటలోని నియో పోలీస్ లేఔట్‌లో గల 15, 16 నెంబర్ల ప్లాట్లను ఆన్‌లైన్‌లో వేలం వేశారు. నియో పోలీసు లేఅవుట్‌కు ముఖద్వారంగా ఉన్న 15వ నెంబరు ప్లాటు 4.03 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ ప్లాటుకు ఉత్తరం, తూర్పు భాగాల్లో 150 అడుగుల రోడ్డు ఉండడంతో పలువురు డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. ఉదయం 11 గంటలకు ప్లాట్ల వేలం ప్రారంభమవగా రాత్రి 7 గంటల వరకు హోరాహోరీగా సాగింది. ఎకరాకు కనీస ధర రూ. 99 కోట్లుగా హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. అయితే 4.03 ఎకరాల విస్తీర్ణంలోని 15వ నెంబరు ప్లాట్‌ను ఎకరం రూ.151.25 కోట్ల చొప్పున లక్ష్మినారాయణ గుమ్మడి, కార్తీష్ రెడ్డి మాడుగుల, శరత్ వెంట్రప్రగడ, శ్యామ్ సుందర్ రెడ్డి వంగాల కలిసి కొనుగోలు చేశారు. 5.03 ఎకరాల విస్తీర్ణంలోని 16వ నెంబరు ప్లాటును రూ.147.75 కోట్లకు గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ రెండు ప్లాట్ల విక్రయం ద్వారా హెచ్‌ఎండీయేకు రూ. 1,353 కోట్లు సమకూరాయి. సోమవారం కోకాపేటలో రెండు ప్లాట్ల విక్రయంతో హెచ్‌ఎండీఏకు రూ.1,357 కోట్ల ఆదాయం వచ్చిన విషయం విదితమే. ఇప్పటి వరకు కోకాపేట భూముల అమ్మకంతో హెచ్‌ఎండీఏకు రూ. 2,710 కోట్లు సమకూరాయి. డిసెంబరు 3, 5 తేదీల్లో కోకాపేటలో 2, మూసాపేటలో 15 ఎకరాల స్థలాల్ని వేలం వేయనున్నారు.