Share News

Anti Corruption Bureau: ఏసీబీ జోరుకు..అనుమతుల కళ్లెం!

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:18 AM

రాష్ట్రంలో ఏసీబీ జోరుకు అనుమతులM ఆటంకం ఎదురవుతోంది. వరుసగా అవినీతి అధికారులను పట్టుకుంటున్నా వారిని విచారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏసీబీకి అనుమతులు రావడం లేదు...

Anti Corruption Bureau: ఏసీబీ జోరుకు..అనుమతుల కళ్లెం!

  • ప్రాసిక్యూషన్‌కు ఏసీబీకి అనుమతివ్వని వైనం

  • వివిధ శాఖ ల అధిపతుల వద్ద మగ్గుతున్న వినతులు

  • జాప్యాన్ని సాకుగా చూపి, కోర్టు ఉత్తర్వులు తెచ్చుకునిపోస్టింగ్‌లు పొందుతున్న అవినీతి ఉద్యోగులు

  • హైకోర్టు ఉత్తర్వులపై సవాల్‌ చేయని అధికారులు

  • లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినామళ్లీ కీలక పోస్టింగులు దక్కించుకుంటున్న కొందరు

  • 9 నెలల్లో 203 కేసులు.. నాలుగో వంతు కేసుల దర్యాప్తునకు కూడా ఏసీబీకి దక్కని అనుమతులు!

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏసీబీ జోరుకు ‘అనుమతుల’ ఆటంకం ఎదురవుతోంది. వరుసగా అవినీతి అధికారులను పట్టుకుంటున్నా వారిని విచారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏసీబీకి అనుమతులు రావడం లేదు. దీనితో అవినీతి కేసుల దర్యాప్తులు ఏళ్లకేళ్లు జాప్యం అవుతున్నాయి. ఈ ఆలస్యాన్ని సాకుగా చూపుతున్న అవినీతి అధికారులు తిరిగి పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా దొరికినవారు కూడా పైఅధికారులను మచ్చిక చేసుకుని కీలకమైన పోస్టులు దక్కించుకుంటున్నారు. ఇలాంటి వారు మళ్లీ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని.. ఉన్నతాధికారుల తీరే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. అవినీతికి పాల్పడుతున్న వారిని, ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారులను ఏసీబీ అరెస్టు చేసినా.. తదుపరి దర్యాప్తు కోసం సదరు అవినీతి అధికారికి సంబంధించిన శాఖ ఉన్నతాధికారుల అనుమతి కావాలి. ఏసీబీ అధికారులు సంబంధిత ఉద్యోగి చేసిన నేరాన్ని వివరిస్తూ, ప్రాసిక్యూషన్‌ చర్యలకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలు రాస్తారు. సంబంధిత శాఽఖాధిపతులు ఏసీబీ లేఖలపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ శాఖాధిపతులు ప్రాసిక్యూషన్‌ చర్యలకు అనుమతులు ఇవ్వకుండా ఏళ్లకేళ్లు పెండింగ్‌లో పెడుతున్నారు. ఆ లోపు సదరు అవినీతి ఉద్యోగులు బెయిల్‌పై బయటికి వచ్చి, మళ్లీ విధుల్లో చేరుతున్నారు. తమపై చర్యలకు అనుమతులు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఏసీబీ లేఖలను అలాగే పెండింగ్‌లో పెట్టేలా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


హైకోర్టును తప్పుదారి పట్టించి..

తిరిగి ఉద్యోగాల్లో చేరిన అవినీతి ఉద్యోగులు రెండు, మూడేళ్లు ఆగి తమకు పదోన్నతులు ఇవ్వడం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ కేసు అంశాన్ని దాచిపెడుతున్నారు. ఈ క్రమంలో వారికి అనుకూలంగా ఉత్తర్వులు వస్తున్నాయి. ఇందులో అవినీతి ఉద్యోగులకు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పదోన్నతులు ఇవ్వడం లేదంటూ సదరు ఉద్యోగులు హైకోర్టులో కేసు వేసినప్పుడు.. ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉండటం వల్లే పదోన్నతి ఇవ్వడం లేదని ఉన్నతాధికారులు కోర్టుకు చెప్పకపోవడమే దీనికి తార్కాణమనే విమర్శలు వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ జగదీశ్‌బాబు.. 2017లో కరీంనగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జగదీశ్‌బాబుపై ప్రాసిక్యూషన్‌ కోసం సంబంధిత శాఖ ఉన్నతాధికారి నుంచి ఏసీబీకి అనుమతి రాలేదు. ఈ క్రమంలో కీలక పోస్టింగ్‌ దక్కించుకున్న ఆయన.. ఈ ఏడాది జూలైలో మరో కాంట్రాక్టర్‌ నుంచి రూ.90వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి మళ్లీ పట్టుబడ్డారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి అధికారులు చాలా మంది ఉన్నారని అధికార యంత్రాంగంలోనే చర్చ జరుగుతోంది. ప్రజావేగులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతుంది.

పావు వంతు కూడా అనుమతులు రాక..

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ఏసీబీ అధికారులు 203 కేసుల్లో ప్రాసిక్యూషన్‌ చర్యలకు అనుమతి కోరుతూ లేఖలు పంపారు. అందులో పావువంతు కూడా అనుమతులు రాలేదని తెలిసింది. గత ఏడాది కూడా 152 కేసుల్లో 223 మందిని అరెస్టు చేసిన ఏసీబీకి సగం కేసుల్లో కూడా ప్రాసిక్యూషన్‌ చర్యలకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదని సమాచారం. దీనితో ఆ కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయలేక పోతుమని ఏసీబీ అధికారులు వాపోతున్నారు. అంతేకాదు ఏళ్లకేళ్ల జాప్యం తర్వాత శాఖాధికారుల నుంచి అనుమతులు వచ్చి, చార్జిషీట్లు దాఖలు చేసినా.. కోర్టు విచారణ పూర్తవడానికి కొన్నేళ్లు పడుతుందని అంటున్నారు. ఇటీవల ఏసీబీ జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనను గమనిస్తే 2013లో నమోదైన కేసులో ఇటీవల అంటే సుమారు 12 ఏళ్ల తర్వాత శిక్ష పడటం గమనార్హం. అవినీతికి పాల్పడుతున్న వారిని పట్టుకోవడం ఎంత ముఖ్యమో, సకాలంలో శిక్షపడేలా చూడటం అంతే ముఖ్యమని ప్రజావేగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులే ఏసీబీకి అడ్డుపడుతుండటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 04:18 AM