Share News

KTRs Formula E Race Case: క్విడ్‌ ప్రో కో

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:25 AM

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చిందని సమాచారం...

KTRs Formula E Race Case: క్విడ్‌ ప్రో కో

  • హెచ్‌ఎండీఏ రూ.45 కోట్లు చెల్లించగానే.. బీఆర్‌ఎస్‌కు రూ.44 కోట్ల విరాళం

  • అనుభవం లేని కంపెనీకి అందుకే అవకాశం

  • రెండో దశ జరక్కుండానే మళ్లీ చెల్లింపులు

  • కేటీఆర్‌పై చార్జిషీట్‌కు అనుమతించండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపిన ఏసీబీ

  • అర్వింద్‌ కుమార్‌, మరికొందరిపై అభియోగాలు

  • నేడు సీఎస్‌ నుంచి గవర్నర్‌ వద్దకు ఫైలు

  • జోక్యానికి సుప్రీం నిరాకరణతో చకచకా పావులు

  • గవర్నర్‌ అనుమతి తర్వాత అరెస్టు లేదా చార్జిషీట్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ నిందితుడిగా ఉన్న ఫార్ములా-ఈ కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చిందని సమాచారం. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి రూ.45 కోట్ల మేర నిధులు ఫార్ములా ఈ కారు రేస్‌లో భాగస్వాములైన కంపెనీకి బదిలీ చేయడం.... ఆ కంపెనీల నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో తిరిగి 44 కోట్ల రూపాయల నిధులు బీఆర్‌ఎ్‌సకు రావడం స్పష్టంగా కనిపిస్తోందని ఏసీబీ అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించిపలు ఆధారాలను ఏసీబీ సేకరించిందని తెలిసింది. క్విడ్‌ ప్రో కో ఫలితంగానే ఫార్ములా రేసింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేని ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ భాగస్వామి అయ్యిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ వివరాలను తాజాగా ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పొందుపరిచారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే నాటి మంత్రి కేటీఆర్‌ ఈ నిధులను బదిలీ చేసేశారని, అది కూడా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఇతర నిందితులుగా ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ సీఈవో కిరణ్‌రావు, ఎఫ్‌ఈవో కంపెనీలను పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు వారిపై ప్రాసిక్యూషన్‌ చర్యలకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఫైలును మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఈ కేసులో మరింత ముందుకెళ్లేందుకు, నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై విజిలెన్స్‌ కమిషనర్‌ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. జీఏడీ అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్‌ వద్దకు బుధవారం ఈ ఫైలును పంపించనున్నారు. ఫార్ములా ఈ కార్‌ రేసులో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా గవర్నర్‌ నుంచి అనుమతి తీసుకోగా..ఇప్పుడు విచారణ ముగిసి నివేదిక సిద్ధమైన తరుణంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్‌ అనుమతిస్తే ఈ కేసులో నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు అవసరమైతే అరెస్టుల వరకూ కూడా వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలంటూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లినా....ఉన్నత న్యాయస్థానం దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ తరుణంలో విచారణ ప్రారంభమైన 9 నెలల అనంతరం ఈ కేసులో తదుపరి కీలక అడుగు పడింది. దర్యాప్తు పూర్తి అయినందున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిపై ప్రాసిక్యూషన్‌ చర్యలకు అనుమతి కోరింది. ప్రాసిక్యూషన్‌ చర్యలకు గవర్నర్‌ అనుమతి లభిస్తే తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా అరెస్టు లేదా నేరుగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్ధమైనట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను ఏసీబీ అఽధికారులు పలుమార్లు గంటల తరబడి విచారించారు. చివరిసారి జరిపిన విచారణ అనంతరం కేటీఆర్‌ సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ స్వాధీనం చేయాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్‌ ఇవ్వడానికి అభ్యంతరం చెపుతూ కేటీఆర్‌ ఏసీబీకి లేఖ రాశారు. తర్వాత న్యాయ పరమైన సలహాతీసుకున్న ఏసీబీ అధికారులు ప్రాసిక్యూషన్‌ చర్యలకు సన్నద్ధమయ్యారు.


రేసు జరగకుండానే డబ్బులు చెల్లింపు

గత ఏడాది డిసెంబరు 19న ఏసీబీ కేటీఆర్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు గవర్నర్‌ అనుమతి కోరింది. డిసెంబరు16న గవర్నర్‌ అందుకు అనుమతించారు. ఆపై ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడైన దానకిశోర్‌ వాంగ్మూలాన్ని డిసెంబరు18న రికార్డు చేశారు. వెంటనే డిసెంబరు19న అధికార దుర్వినియోగానికి సంబంధించి కేటీఆర్‌, అర్వింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డి, మరో రెండు సంస్ధలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కారు రేసు వ్యవహరంలో నాటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘించి హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రూ.45 కోట్లను ఎఫ్‌ఈఓకు పంపించారని, అందులోనూ విదేశీ కరెన్సీలో డబ్బు చెల్లింపులు జరిగాయని, ఇందుకు ఆర్‌బీఐ అనుమతి తీసుకోలేదని, విదేశీ కరెన్సీ చెల్లింపులు ద్వారా దాదాపు ఏడు కోట్ల రూపాయలను ఐటీకి హెచ్‌ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏ, ఫార్ములా ఈ కారు రేసు కంపెనీ, ఎస్‌ నెక్ట్స్‌జన్‌ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రేసు నిర్వహించాల్సి ఉండగా, ఫార్ములా ఈ కారు రేసు రెండో దశ జరగకుండానే డబ్బు చెల్లింపులు జరిగాయని ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. కేటీఆర్‌ తదితరులపై ఏసీబీ కేసు నమోదు చేసిన మరునాడే ఈడీ అధికారులు రంగంలో దిగి ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేటీఆర్‌, అర్వింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డి రెడ్డి తదితరులను ఈడీ, ఏసీబీ అధికారులు పలుమార్లు విచారించారు.

సుప్రీంలో కేటీఆర్‌ పిటిషన్‌ తిరస్కరణ

ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించినప్పటికీఆయనకు ఊరట లభించలేదు. కేవలం అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు మాత్రం లభించాయి. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ అవసరమని, పిటిషన్‌ను ఉపసంహిస్తున్నట్లుగా పరిగణిస్తూ కొట్టేస్తున్నామని ఈ ఏడాది సెప్టెంబరు 2న ప్రకటించింది. సుప్రీంకోర్టు కేటీఆర్‌ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే ఏసీబీ అధికారులు చకచకా పావులు కదిపారు. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను క్రోడీకరించి ప్రాసిక్యూషన్‌ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపించారు.

Updated Date - Sep 10 , 2025 | 10:06 AM