ACB Raids Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయ ఇన్‌చార్జి ఎస్‌ఈ నివాసాల్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:52 AM
లడ్డూ ప్రసాదాల యంత్రాల మరమ్మతు బిల్లు మంజూరుకు కమీషన్ డిమాండ్ చేసిన యాదగిరిగుట్ట దేవస్థానం విద్యుత్ విభాగం ఇన్‌చార్జి...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన దేవస్థాన ఇంజనీర్
యాదాద్రి/కొత్తపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): లడ్డూ ప్రసాదాల యంత్రాల మరమ్మతు బిల్లు మంజూరుకు కమీషన్ డిమాండ్ చేసిన యాదగిరిగుట్ట దేవస్థానం విద్యుత్ విభాగం ఇన్‌చార్జి ఎల్బీనగర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ గురువారం ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఏసీబీ నల్లగొండ జిల్లా రేంజ్ డీఎస్పీ జగదీ్‌ష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట సమీపంలోని ఓ కాంట్రాక్టర్‌కు ఆలయంలో లడ్డూ ప్రసాదాల యంత్రాల మరమ్మతుకు సంబంధించి రూ.11.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. వాటి మంజూరు కోసం ఆలయ ఇన్‌చార్జి ఎస్‌ఈ ఊడెపు వెంకట రామారావును సంప్రదించగా, ఆయన 20శాతం కమీషన్ డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ రూ.1.90లక్షలు లంచం ఇచ్చేందుకు అంగీకరించి ఆధారాలతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని బోడుప్పల్ వద్ద కాంట్రాక్టర్ నుంచి వెంకట రామారావు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రామారావును యాదిగిరిగుట్టలోని ఈఈ కార్యాలయానికి తీసుకువచ్చి అర్ధ రాత్రి వరకు సోదాలు నిర్వహించామని డీఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపారు.