Share News

Government Negligence: ఆర్టీఏ చెక్‌పోస్టులు.. అవినీతికి అడ్డాలు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:28 AM

తెలంగాణలోని, సరిహద్దుల్లోని 12 అంతర్రాష్ట్ర రాష్ట్ర రవాణా సంస్థ (ఆర్టీఏ) చెక్‌పోస్టులు అవినీతి, అక్రమాలకు ఆలవాలంగా మారాయి. ఆయా చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న...

Government Negligence: ఆర్టీఏ చెక్‌పోస్టులు.. అవినీతికి అడ్డాలు

  • వాహన యజమానుల నుంచి ప్రైవేటు సిబ్బందితో వసూళ్లు

  • రాష్ట్ర వ్యాప్తంగా 12 చెక్‌పోస్టుల వద్ద ఏసీబీ తనిఖీలు

  • రూ.4.18 లక్షల నగదు, చెక్‌పోస్టుల రికార్డుల జప్తు

  • అస్తవ్యస్తంగా రికార్డులు, హాజరు పట్టికల నిర్వహణ

  • ఏసీబీ అధికారుల అదుపులో పలువురు ప్రైవేటు సిబ్బంది

  • విధుల నిర్వహణపై ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం

  • రవాణాశాఖకు ఏసీబీ అధికారుల నివేదిక

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తెలంగాణలోని, సరిహద్దుల్లోని 12 అంతర్రాష్ట్ర రాష్ట్ర రవాణా సంస్థ (ఆర్టీఏ) చెక్‌పోస్టులు అవినీతి, అక్రమాలకు ఆలవాలంగా మారాయి. ఆయా చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న మోటారు వాహనాల తనిఖీ అధికారులు (ఎంవీఐ).. ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర వాహన యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని తమ తనిఖీల్లో తేలిందని రవాణాశాఖకు ఏసీబీ అధికారులు నివేదికను సమర్పించారు. విధుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 12 ఆర్టీఏ చెక్‌పోస్టులపైౖ ఏక కాలంలో ఏసీబీ అధికారులు.. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ జరిపిన దాడుల్లో రూ.4,18,880 నగదుతోపాటు ఆయా చెక్‌పోస్టుల రికార్డులను జప్తు చేశారు. చెక్‌పోస్టుల వద్ద పని చేస్తున్న ప్రైవేటు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం బోరజ్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీలో అత్యధికంగా (లెక్కకు మించి ఉన్న) రూ.1.26 లక్షల నగదును జప్తు చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి శివారులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టులో రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉంది. రికార్డులకు, నగదుకు పొంతన కుదరడం లేదు. విధులు నిర్వహిస్తున్న మోటారు వాహనాల సహాయ తనిఖీ అధికారి (ఏఎంవీఐ) కిరణ్‌కుమార్‌ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఇక, కామారెడ్డి జిల్లా సలాబాత్‌పూర్‌, భిక్కనూరు మండలం పొందుర్తి చెక్‌పోస్టులో పని చేస్తున్న ముగ్గురు ఆర్టీఏ సిబ్బందితోపాటు వాహనాల యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు, 167వ నంబర్‌ జాతీయ రహదారిపై గల సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరిగాయి. తమ తనిఖీల్లో దొరికన నగదుపై మోటారు వాహనాల తనిఖీ అధికారి (ఎంవీఐ) ప్రవీణ్‌ సరైన సమాధానం చెప్పలేదని మహబబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏంవీఐ ప్రవీణ్‌, నలుగురు ప్రభుత్వ సిబ్బందితోపాటు మరో నలుగురు ప్రైవేటు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించామన్నారు. తమ తనిఖీల సమాచారం తెలుసుకుని ముందస్తుగా దాదాపు రూ.15 లక్షల నగదును సంబంధిత ఆర్టీఏ అధికారి అక్కడి నుంచి తరలించినట్లు ఏసీబీ వర్గాల విశ్వసనీయ సమాచారం. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం కాలనీ చెక్‌పోస్టు సెక్యూరిటీ గార్డు అప్రమత్తమయ్యే లోపు సాదాసీదాగా వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులోకెళ్లి కంప్యూటర్‌, నగదు, రికార్డులు జప్తు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం చెక్‌పోస్టు వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.

Updated Date - Oct 20 , 2025 | 04:29 AM