Share News

DTC Deputy Transport Commissioner Properties: డీటీసీ ఆస్తులు 200 కోట్లు

ABN , Publish Date - Dec 24 , 2025 | 05:32 AM

రవాణాశాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం.కిషన్‌నాయక్‌కు సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు....

DTC Deputy Transport Commissioner Properties: డీటీసీ ఆస్తులు  200 కోట్లు

  • మహబూబ్‌నగర్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ నివాసాల్లో ఏసీబీ సోదాలు

  • 41 ఎకరాల భూములు, కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపు

  • నిజామాబాద్‌లో ఓహోటల్‌లో 50ు వాటా

  • 3 వేల గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు

  • బ్యాంకు ఖాతాల్లో రూ.1.37 కోట్ల నగదు

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ నాయక్‌ అరెస్టు

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌/నారాయణఖేడ్‌/బోయినపల్లి, డిసెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం.కిషన్‌నాయక్‌కు సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటల్‌, ఫర్నీచర్‌ దుకాణాల్లో వాటాలున్నట్టు తేల్చింది. సోదాల అనంతరం కిషన్‌నాయక్‌ను అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లో ఓల్డ్‌ బోయినపల్లి ఆర్‌ఆర్‌ నగర్‌ కాలనీలోని కిషన్‌నాయక్‌ నివాసం, హైదరాబాద్‌, నిజామాబాద్‌, నారాయణఖేడ్‌లలో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలు, మహబూబ్‌నగర్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కిషన్‌నాయక్‌ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బల్కంచెల్క తండాలోని ఆయన నివాసం, సమీప బంధువుల ఇళ్లలో, బాచేపల్లికి చెందిన ఆయన సన్నిహితులు గోపాల్‌, కిరణ్‌ల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయనకు సంబంధించి భూముల వివరాలు సేకరించారు. కిషన్‌నాయక్‌కు నారాయణఖేడ్‌లో 31 ఎకరాలు, నిజామాబాద్‌లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.37 కోట్ల నగదు, నిజామాబాద్‌లో లహరి ఇంటర్నేషనల్‌ హోటల్‌లో సగం వాటా, అక్కడి రాయల్‌ ఓక్‌ ఫర్నీచర్‌ దుకాణానికి అద్దెకు ఇచ్చిన మూడు వేల గజాల వాణిజ్య ప్రదేశం, అశోకా టౌన్‌షి్‌పలో రెండు ఫ్లాట్లు, నాలుగు వేల చదరపు అడుగుల స్థలంలో పాలిహౌస్‌ ఉన్నట్టు గుర్తించామని ఏసీబీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఇక దిల్‌సుఖ్‌నగర్‌లో ఆయన బంధువు విజయ్‌ ఇంట్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పత్రాలపై లెక్కల ప్రకారం కిషన్‌నాయక్‌ ఆస్తులు రూ.12.72కోట్లు అని, బహిరంగ మార్కెట్‌ విలువ రూ.200కోట్ల వరకు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కిషన్‌నాయక్‌ ఇటీవలి వరకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. ఏడాది క్రితమే మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారు.

Updated Date - Dec 24 , 2025 | 05:32 AM