Share News

ACB: కారు రేసు కేటీఆర్‌ సొంత నిర్ణయం

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:57 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నిందితుల ప్రాసిక్యూషన్‌కు గమర్నర్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. వారి పాత్రకు సంబంధించిన నివేదికను ఏసీబీ రూపొందించింది.

ACB: కారు రేసు కేటీఆర్‌ సొంత నిర్ణయం

  • నిధుల చెల్లింపులో క్విడ్‌ ప్రోకో జరిగింది

  • బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.44 కోట్లు.. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో అందాయి

  • రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు

  • అధికారాన్ని దుర్వినియోగం చేశారు

  • గవర్నర్‌ బదులు అర్వింద్‌కుమార్‌ సంతకం

  • ప్రజాధనాన్ని దారి మళ్లించారు

  • నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు

  • ఫార్ములా-ఈ రేసు కేసులో చార్జిషీట్‌ రెడీ!

  • నివేదికలో సవివరంగా పేర్కొన్న ఏసీబీ

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నిందితుల ప్రాసిక్యూషన్‌కు గమర్నర్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. వారి పాత్రకు సంబంధించిన నివేదికను ఏసీబీ రూపొందించింది. ఇందులో పలు అంశాలను సవివరంగా పేర్కొంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఏసీబీ చార్జీషీట్‌లో.. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కారు రేస్‌ నిర్వహించాలనేది కేటీఆర్‌ తీసుకున్న సొంత నిర్ణయమని, ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్రైవేట్‌ సంభాషణలతో రేస్‌ నిర్వహించారని పేర్కొంది. ఇందులో క్విడ్‌ ప్రోకో జరిగిందని, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.44 కోట్లు అందాయని తెలిపింది. ఫార్ములా-ఈ కారు రేసు కంపెనీ, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, హెచ్‌ఎండీఏకు మధ్య జరిగిన త్రిపక్ష ఒప్పందానికి ముందే ఎలక్టోరల్‌ బాండ్లను 2022 ఏప్రిల్‌, అక్టోబరు నెలల్లో చెల్లించారని తెలిపింది. బీఆర్‌ఎ్‌సకు ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చినందుకే ఏస్‌ నెక్ట్స్‌జెన్‌కు ప్రమోటర్‌గా అవకాశం కల్పించారని ఏసీబీ పేర్కొంది. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 166(1), 299 నిబంధనల ఉల్లంఘన జరిగిందని, గవర్నర్‌ సంతకంతో చేయాల్సిన కాంట్రాక్టులను కాంపిటెంట్‌ అథారిటీ అనుమతి లేకుండా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌ చేశారని వివరించింది. రెండు అగ్రిమెంట్లు గవర్నర్‌ నోటీసులో లేవని, పురపాలక శాఖ అనుమతులు పొందలే దని స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ ప్రమోటర్‌గా ఉండేందుకుగాను నిధులు ఉపయోగించారని, కానీ.. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నివేదికలో ఏసీబీ పేర్కొంది. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రి, నాటి ముఖ్యమంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. రూ.10 కోట్ల కంటే ఎక్కువ నిధులు చెల్లించాల్సి వస్తే తప్పనిసరిగా ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాలని గుర్తు చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడే నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. త్రిపక్ష ఒప్పందంలో లేకపోయినా సీజన్‌-9 నిర్వహణకు సంబంధించి రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని, అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి కలిసి ఎఫ్‌ఈవోకు రూ.46 కోట్లు చెల్లించారని, ఆర్బీఐ నిబఽంధనల ఉల్లంఘన కింద మరో రూ8 కోట్లు అదనంగా చెల్లించారని వివరించింది. 2023 అక్టోబరు 30న చేసుకున్న రెండో ఒప్పందం ప్రకారం సీజన్‌ 10, 11, 12లను నిర్వహిస్తే ప్రభుత్వంపై రూ.600 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. హెచ్‌ఎండీఏ ఇందులోకి రాకుండా ఉంటే బాధ్యత అంతా ఏస్‌ నెక్స్ట్‌జెన్‌ మీదే ఉండేదని, పథకం ప్రకారమే నేరానికి పాల్పడ్డారని ఏసీబీ స్పష్టం చేసింది. నీల్సన్‌ నివేదిక అంటూ కేటీఆర్‌ రాష్ట్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారని, కానీ.. వాటి వివరాలు కోరితే ఆ కంపెనీ ఇవ్వలేదని తెలిపింది.


నిందితుల పాత్ర ఇలా..

  • ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ పద్ధతిలో అనుమతులు మంజూరు చేశారు. అధికారాన్ని సొంత లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు.

  • ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌.. హెచ్‌ఎండీఏ మునిసిపల్‌ కమిషనర్‌తోపాటు, పురపాలక శాఖ చీఫ్‌ సెక్రటరీగా ఉంటూ రెండు చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. శాఖాపరమైన విచారణ జరగకుండా అంతా తానై నడిపించి అక్రమాలకు పాల్పడ్డారు.

  • బీఎల్‌ఎన్‌ రెడ్డి.. తప్పు అని తెలిసినా బిల్లులను హెచ్‌ఎండీఏ నుంచి మంజూరు చేయించారు. కింది స్థాయి సిబ్బందిని బలవంతంగా ఒప్పించారు.

  • మల్లేశ్వరరావు.. ఫార్ములా-ఈ కారు రేసు డీల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎలక్ట్రానిక్ బాండ్ల చెల్లింపుల వరకు అన్నింట్లో ఫెసిలిటేటర్‌ ఆర్కిటెక్ట్‌గా అక్రమాలకు పాల్పడ్డారు.

  • ఎఫ్‌ఈవో సీఈవో.. చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యవహరించకుండా అగ్రిమెంట్‌తో సంబంఽధం లేని హెచ్‌ఎండీఏ నుంచి నిధులు పొందారు. మరో ఒప్పందాన్ని అక్రమంగా రద్దు చేశారు. అక్రమ పద్ధతిలో పొందిన డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.

  • నిందితుల్లో కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(ఏ)(1) రెడ్‌విత్‌ 13(2) కింద నేరానికి పాల్పడ్డారు. ప్రభుత్వ అధికారులుగా, ప్రజా ప్రతినిధిగా ఉంటూ హెచ్‌ఏండీఏకు నష్టం కలిగించి.. ఎఫ్‌ఈవో సీఈవోకు భారీ లాభం చేకూర్చారు. ఐపీసీ 409 సెక్షన్‌ ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ప్రజాధనాన్ని దారి మళ్లించారు. ఐపీసీ 120 ప్రకారం వీరంతా నేరపూరిత కుట్రలో భాగస్వామ్యులయ్యారు.

Updated Date - Nov 23 , 2025 | 06:00 AM