Bribe for Building Permit: ఏసీబీ వలలో ఆదిభట్ల టీపీవో
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:45 AM
ఓ అవినీతి టౌన్‌ప్లానింగ్ అధికారి తాను పట్టుబడకుండా తెలివిగా లంచం తీసుకోవాలని విఫలయత్నం చేశాడు. ఆ రోజు విధులకు గైర్హాజరై..
నిర్మాణ అనుమతులకు రూ.1.50 లక్షల డిమాండ్
ఆదిభట్ల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఓ అవినీతి టౌన్‌ప్లానింగ్ అధికారి తాను పట్టుబడకుండా తెలివిగా లంచం తీసుకోవాలని విఫలయత్నం చేశాడు. ఆ రోజు విధులకు గైర్హాజరై.. దరఖాస్తుదారు నుంచి డబ్బు తీసుకునేందుకు తన సహాయకుడిని పురమాయించాడు. దీంతో ఏసీబీ వలలో అతను చిక్కాడు. పట్టువదలని అధికారులు ఫోన్ లొకేషన్ ద్వారా టీపీఓ జాడ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సిటీరేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాల ప్రకారం.. గద్వాల్ జిల్లా జోగులాంబ ఐజాలో పని చేస్తున్న బందెల వరప్రసాద్ నెల క్రితం డిప్యుటేషన్‌పై రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పురపాలికకు వచ్చారు. ఆదిభట్ల పరిధిలో 400 గజాల స్థలంలో బిల్డ్ నౌ పోర్టల్‌లో జీ ప్లస్ 4 భవన నిర్మాణ అనుమతికి మోత్కూరి ఆనంద్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో అనుమతి రాకపోవడంతో టౌన్ ప్లానింగ్ అఽధికారి వరప్రసాద్‌ను సంప్రదించారు. రూ.1.50 లక్షలు లంచం ఇవ్వాలని టీపీఓ డిమాండ్ చేశాడు. దరఖాస్తుదారు రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకుని 6వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం డీఏస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీజోన్-2 బృందం ఆదిభట్ల కార్యాలయంలో దాడులు చేశారు. టీపీఓ సహాయకుడు వంశీకృష్ణ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి టీపీవో వరప్రసాద్ గురువారం కార్యాలయానికి రాలేదు. ఫోన్ లొకేషన్ ద్వారా అతన్ని జిల్లెలగూడలో అదుపులోకి తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు.