సమృద్ధిగా యూరియా నిల్వలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:52 AM
రాష్ట్రంలో పంటల సాగుకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భువనగిరి (కలెక్టరేట్), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంటల సాగుకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు యూరియా పంపిణీపై హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి గోష్, కార్యదర్శి కే.సురేంద్రమోహన్‌లతో కలిసి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులకు ప్రణాళికబద్దంగా పంపిణీ చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌కింద ఎంపిక చేయబడిన జిల్లాల్లో యూరియా యాప్ ద్వారా పంపిణీపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంతరావు, జిల్లా వ్యవసాయాధికారి రమణారెడ్డి, ఏడీఏ నీలిమ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.