Aadi Srinivas: బీఆర్‌ఎస్ తీరు దొంగే.. దొంగ అన్నట్లుంది!
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:36 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ తీరు.. దొంగే.. దొంగ.. దొంగ.. అన్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పదేళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్‌లు చేసి దొరికిన దొంగలు..
ట్యాపింగ్ చేయాల్సిన కర్మ మాకు లేదు: ఆది శ్రీనివాస్
బీసీల పక్షపాతి ఎప్పటికీ కాంగ్రెస్సే: చనగాని
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ తీరు.. దొంగే.. దొంగ.. దొంగ.. అన్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పదేళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్‌లు చేసి దొరికిన దొంగలు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటూ సొంత పత్రికలో రోత రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ కాంగ్రెస్ సర్కారుకు పట్టలేదన్నారు. గురువారం గాంధీభవన్‌లో ‘అందుబాటులో ప్రజా ప్రతినిధులు కార్యక్రమం’లో భాగంగా ఆది శ్రీనివాస్.. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నిందితులు ఏ కలుగులో దాక్కున్నా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారుపై విష ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎ్‌సకు స్థానిక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదన్నారు.
బీజేపీ పట్ల.. గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ వైఖరిని బీఆర్‌ఎస్ అనుసరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం బీజేపీ నేతలకు ఇష్టం లేదని రాష్ట్ర గ్రంథాలయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. అందుకే వారు.. పేద ముస్లింల భుజాలపై తుపాకీ పెట్టి.. బీసీ రిజర్వేషన్లను కాల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇస్తామని ఓ వైపు ప్రధాని మోదీ చెబుతుంటే.. బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారన్నారు. బీసీల పక్షపాతి ఎప్పటికీ కాంగ్రెస్సేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని.. ఆ పార్టీ కుట్రలను బీసీ సమాజం గమనిస్తోందని చెప్పారు.