kumaram bheem asifabad- చాకలి ఐలమ్మకు ఘన నివాళి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:07 PM
జిల్లా వ్యాప్తంగా బుధవారం చాకలి ఐల మ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి అధికారులు, నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం చాకలి ఐల మ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి అధికారులు, నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకకటేష్ దోత్రే, ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తొలి తరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం అహర్నిషలు పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ చూపిన దైర్యం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మను స్మరిస్తూ కమ్యూనిటీ హాలు, చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం చేశారన్నారు. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సజీవన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, పీఏసీఎస్ ఛైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కడతల మల్లయ్య, సంఘం నాయకులు భూమయ్య, రాజేందర్, గణపతి, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జాబరి రవిందర్ పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్ధంగా రజక సంఘం మండల అద్యక్షుడు సత్తయ్య మాట్లాడుతూ దొరల వ్యవస్థను తిప్పికొట్టేందుకు పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో పొన్న వెంకటేష్, రాకేష్, కార్తీక్, నవీన్, వెంకటేష్ పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో శ్రావణ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.